Bonda Uma News: విజయవాడ అత్యాచార ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తోందని తెదేపా నేత బొండా ఉమా ఆరోపించారు. ప్రభుత్వాసుపత్రిలో భద్రతా వైఫల్యాలపై ప్రభుత్వ చర్యలు శూన్యమన్నారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తీరును తప్పుబట్టిన ఉమా.. వివరణ ఇవ్వాలంటూ మహిళా కమిషన్ తమకు పెట్టిన డెడ్‌లైన్ 27వ తేదీలోగా బాధితురాలికి సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే.. బాధితురాలి పక్షాన ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పారు. వాంబే కాలనీలో ఖాళీగా ఉన్న ఇల్లు బాధితురాలికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లిదండ్రులకు బొండా ఉమా మద్దతు తెలిపారు. దేశం మొత్తం నివ్వెరపోయిన ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆరోపించారు. వ్యక్తిగత కక్షలో భాగంగా ఇచ్చిన నోటీసులకు తాము వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వాసిరెడ్డి పద్మ అధికార దుర్వినియోగంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.
ఇదీ చదవండి: పోలీసులు మమ్మల్ని బెదిరిస్తున్నారు : విజయవాడ అత్యాచార బాధిత కుటుంబం