ATCHENNA ON COVID: వందల కోట్ల రూపాయల కరోనా నిధులు మింగేసారా లేదా మరణాలను తక్కువ చేసి చూపించారా అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ హయాంలో కొవిడ్ మరణాల(covid deaths in ap) సంఖ్య ముందు నుంచే మిస్టరీగా మారిందని విమర్శించారు. ఆక్సిజన్, బెడ్ల కొరత, అరకొర వసతులు, చెత్త భోజనం, తగ్గించి చూపించిన కేసులు, మరణాలపై ప్రశ్నించిన వారిని కేసులు పెట్టి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా మరణాలపై తాజాగా పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానంతో స్పష్టమైందన్నారు. (atchenna on covid deaths) రాష్ట్రంలో కరోనా మరణాలు ప్రభుత్వం చెబుతున్నట్లు కేవలం 14,733 కావనీ, 47,228 మంది మృతి చెందినట్లు అర్థమవుతోందన్నారు. చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రకటించిన మరణాలకు, కేంద్రం ప్రకటించిన మరణాలు ఎందుకు అధికంగా ఉన్నాయో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై(tdp leader atchenna on polavaram) పూటకో కహానీ చెబుతూ తప్పించుకొని తిరుగుతున్నట్లు.. కరోనా మరణాల గురించి కూడా మాకేమీ తెలియదని దాటవేస్తారా అని ఎద్దేవా చేశారు.
ఇదీ జరిగింది: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కారణంగా 47,228 మంది చనిపోయినట్లు తేలింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర విపత్తు సహాయనిధి ద్వారా చెల్లించిన పరిహారం లెక్కల ద్వారా ఇది వెల్లడైంది. రాష్ట్రంలో అధికారికంగా ప్రకటించిన 14,733 మరణాలతో పోలిస్తే ఈ సంఖ్య 220% అధికం. తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు శుక్రవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని వెల్లడించింది. కొవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాల నుంచి నష్టపరిహారం కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంత మందికి చెల్లించారు? ఎన్ని తిరస్కరించారు? అని ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ‘‘వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ ఏడాది మే 27 నాటికి 7,91,353 దరఖాస్తులను పరిష్కరించి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై 26న రాసిన లేఖ ప్రకారం పరిహారం కోసం 50,399 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 47,228 క్లెయిమ్స్‌ను ఆమోదించి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున చెల్లించారు. 3,171 దరఖాస్తులను తిరస్కరించారు’’ అని మంత్రి వెల్లడించారు.
ఇవీ చదవండి: