చిన్నారుల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ సకుటుంబంగా టపాసులతో వెలుగుల సంబరాన్ని పంచుకునే పండుగే దీపావళి. అందుకే ఏటా ఈ పండుగ నాడు ఇచ్చుకునే బహుమతుల్లో టపాసుల పెట్టెలే ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. కాలుష్యానికి కారణమయ్యే టపాసులను బహుమతిగా ఇచ్చేకన్నా... నోరు తీపి చేసే మిఠాయి పెట్టెలిస్తే మంచిదనే ఆలోచన ప్రజల్లో పెరుగుతోంది. ప్రజల అభిరుచికి అనుగుణంగా మిఠాయి దుకాణదారులు సైతం సరికొత్త తియ్యటి బహుమతులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
మిఠాయిలే... టపాసులు
విజయవాడలో ఈసారి దీపావళికి సరికొత్తగా పేలే టపాసుల స్థానంలో తినే టపాసులను సిద్ధం చేసేస్తున్నారు మిఠాయి వర్తకులు. పీవీపీ మాల్ సమీపంలోని బాలాజీ స్వీట్ హోమ్ ఈ వినూత్న టపాసులతో కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. చూసేందుకు అచ్చం దీపావళి టపాసుల్లా అనిపించే విధంగా చాక్లెట్లు, స్వీట్లు తయారు చేస్తున్నారు.
తియ్యని వేడుక
తియ్యటి టపాసులతో పాటు రకరకాల తియ్యటి బహుమతులను అందుబాటులోకి తీసుకొచ్చారు వ్యాపారులు. చూడచక్కని ఆకృతుల్లో డ్రై ఫూట్స్ అమర్చి వైవిధ్యమైన బహుమతులను సిద్ధం చేస్తున్నారు. పండగ నాడు ఎవరికైనా ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలపాలనుకునే వారు ఇటువంటి బహుమతులపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకప్పుడు మిఠాయిలు పంచాలంటే కేజీ, అరకేజీ తీసుకుని బహుమతిగా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ ఇచ్చే మిఠాయిలను అత్యంత ఆకర్షణీయంగా ఇవ్వాలనుకుంటున్నారు.
పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఎప్పటికప్పుడు వైవిధ్యమైన విధానాలను అలవరుచుకోవాలి. అది ఏ రంగమైనా... అందుకే ఏడాది పొడవునా గిరాకీ ఉండే మిఠాయి దుకాణదారులు సైతం సందర్భాన్ని బట్టి వినూత్నమైన ఆలోచనలు ఆచరణలో పెట్టి వ్యాపారాలను మరింత వృద్ధి చేసుకుంటున్నారు. దీపావళి ప్రత్యేకం అంటూ తియ్యటి టపాసులతో నగరవాసులను ఆకర్షిస్తున్నారు. మరి మనమూ ఆ మిఠాయి టపాసులతో తియ్యని వేడుక చేసుకుందామా...!
ఇదీ చదవండి :