ఈ వేసవి సామాన్య ప్రజానికానికి ఎన్నో కష్టాలను తీసుకోస్తోంది. నీటి ఎద్దడి, విపరీతమైన ఎండతోపాటు... కూరగాయల ధలనూ పెంచుతోంది. కొద్దిరోజుల ముందు కిలో టమాట రూ.15 ఉండగా... ప్రస్తుతం రెండింతలు పెరిగి 32 రూపాయలకు చేరుకుంది. వీధుల్లో తిరిగి అమ్మేవారు 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. గతంలో జిల్లా పరిసర ప్రాంతాలనుంచి కూరగాయలు తీసుకొచ్చి మార్కెట్లలో అమ్మేవారు. ప్రస్తుతం పెరిగిన ఉష్ణోగ్రతలు, నీటి లేమి కారణంగా... రైతులు కూరగాయల పంటల వైపు ఆసక్తి చూపడంలేదు. వేరే రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవడంతో... ధరలు పెరుగుతున్నాయి.
దండుకుంటున్న దళారులు...
దీన్నే అవకాశంగా భావించి దళారులు దండుకుంటున్నారు. అన్నింటికన్నా టమాట వినియోగం ఎక్కువగా ఉండటంతో... ధరలు అమాంతం పెంచేస్తున్నారు. రాష్ట్రంలోని 120 రైతు బజార్లకు వారానికి 15వేల క్వింటాళ్ల టమాట దిగుమతి అవుతుండగా... అంతకు 10 రెట్లు బహిరంగ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. శుభకార్యాల సీజన్ కూడా కావడంతో ధరలు తగ్గే పరిస్థితి లేదని వ్యాపారులు అంటున్నారు. ఇదిలావుంటే టమాట రైతులకు కాస్తంత గిట్టుబాటు ధర లభిస్తోందని చెప్తున్నారు. మొత్తం మీద పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల ప్రభావం కూరగాయల ధరలపై పడటం సామాన్యుడికి కొత్త భారమనే చెప్పాలి.