ప్రొబేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళన చేపట్ఠారు. ఇందులో భాగంగా.. బయోమెట్రిక్ అటెండెన్స్‌ను బహిష్కరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లా నందిగామ మండలంలో.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రొబేషన్ ఇప్పటికే మూడు నెలలు ఆలస్యమైందని.. మరింత జాప్యం చేయడం సరికాదన్నారు. రూ.15వేల వేతనంతో చాలా ఇబ్బంది పడుతున్నామని.. ప్రొబేషన్ ప్రకటించి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు.
ప్రొబేషన్ డిమాండ్‌కు నిరసనగా.. గుడివాడలో సచివాలయ ఉద్యోగులు నిరసనకు దిగారు. ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ సహా వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. తమకు న్యాయం చేయాలంటూ నినదించారు.
విజయనగరంలో..
ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలంటూ విజయనగరం జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి ప్రొబేషన్ డిమాండ్‌తో ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సాలూరు ఎంపీడీవోకు, సచివాలయ ఉద్యోగులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. కొవిడ్ విజృభించిన వేళ ప్రాణాలను పణంగా పెట్టి పని చేశామని.. తమ సేవలను గుర్తించి న్యాయం చేయాలని కోరారు.
చిత్తూరులో..
చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో.. సచివాలయ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ రఘునాథ్ రెడ్డికి ఎదురుగా.. బైఠాయించి ఆందోళన చేపట్టారు.
కడపలో..
కడప జిల్లా ప్రొద్దుటూరులో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నిరసన చేపట్టారు. అనిబిసెంట్ పాఠశాల నుంచి శివాలయం కూడలి మీదుగా.. ర్యాలీ చేపట్టారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు.
అనంతపురంలో..
అనంతపురం రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేప్టటారు. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తే.. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదన్నారు. పెరిగిన ధరలతో తాము కుటుంబాలను నడపలేకపోతున్నామని వాపోయారు.
విశాఖలో..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని.. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉద్యోగులు డిమాండ్ చేశారు. నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. సుమారు 150 మంది ఉద్యోగులు.. నర్సీపట్నం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి:
SECURITY AT CM CAMP OFFICE: సీఎం నివాసం, క్యాంప్ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు.. ఎందుకంటే?