విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అక్టోబర్ వరకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు స్పైస్‌జెట్ సంస్థ ప్రకటించింది. నేటి నుంచి ఈ సర్వీసులను నిలిపేస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లోనూ టిక్కెట్ల విక్రయాలు ఆపేశారు. అక్టోబరు నెలాఖరు వరకు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు తెలిసింది. గన్నవరం విమానాశ్రయం అధికారులకు స్పైస్ జెట్ సంస్థ సమాచారమిచ్చింది.
ప్రస్తుతం స్పైస్‌జెట్ కేవలం ఒక్క నగరానికి మాత్రమే సర్వీసులు నడుపుతోంది. గతంలో విజయవాడ నుంచి చెన్నై, విశాఖ, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు సర్వీసులు నడిచేవి. దశలవారీగా ఒక్కో నగరానికి విమాన సర్వీసులను సంస్థ నిలిపేస్తూ వచ్చింది. ప్రస్తుతం పూర్తిగా విమానాశ్రయం నుంచి స్పైస్‌జెట్ సర్వీసులు ఆగిపోయాయి.
ఇక గన్నవరం నుంచి ఎయిరిండియా, ఇండిగో, ట్రూజెట్ విమానాలు మాత్రమే నడవనున్నాయి. గన్నవరం నుంచి నడిచే తమ విమాన సర్వీసుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గడం, ఇతర కారణాల వల్ల రద్దు చేసినట్టు స్పైస్‌జెట్ సంస్థ తెలియజేసినట్టు సమాచారం. సెప్టెంబరు తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి విమాన సర్వీసులను పునరిద్ధరించాలా? లేదా? అనేది ఆలోచిస్తామని సంస్థ పేర్కొన్నట్టు తెలిసింది.
ఇదీ చదవండి: krishna water: మాకు 70.. వారికి 30 పంచండి.. కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఏపీ లేఖ