- ఇటీవలి భారీ వర్షాలతో వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది?
వర్షాకాలంలో నీరు నిలిచిపోయి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. నీరు నిల్వ ఉండటం వల్ల ఈగలు, దోమలు పెరిగి ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ఇక ఆహారం విషయంలో కాస్త అజాగ్రత్తగా ఉన్నా.. విరోచనాలు, వాంతులు వంటివి వచ్చే అవకాశం ఉంది. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉన్నప్పుడు కాచి చల్లార్చిన నీటిని తీసుకోవటంతో పాటు వేడి వేడి ఆహారాన్ని తీసుకోవాలి. ఇలాంటి వరదల సమయంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి అన్ని రకాల ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. శరీరం వేడిగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఇటీవలి కాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరిగినట్టు తెలుస్తోంది. అలాంటి కేసులు వస్తున్నాయా?
అవును. నీరు నిలిచి ఉండటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కొందరికి శరీరంపై కురుపులు వస్తుంటాయి. ఇక ఇలాంటి సమయంలో తప్పక కాచిన నీరు తాగాలి. సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాధుల నేపథ్యంలో ప్రభుత్వం సైతం వరదలు ఉన్న ప్రాంతాల్సో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తోంది.
- ప్రభుత్వం ఏఏ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది. క్యాంపులు ఏర్పాటు చేసిన చోట ఆరోగ్యానికి సంబంధించిన టెస్టులు చేసే అవకాశం ఏమైనా ఉందా?
బస్తీ దవాఖానాలు 24 గంటలు పని చేస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాలకు ప్రభుత్వం తరఫున వాహనాలను పంపి.. వైద్య సహాయం అందిస్తున్నారు. కిడ్నీ, గుండె జబ్బులు ఉన్న వారికి మందులను అందిస్తున్నారు. అత్యవసర మందులు అవసరమైన వారికి తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకున్నాం. దీంతో పాటు వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
- డ్రైనేజీ నీళ్లు వరదనీటిలో కలుస్తున్నాయి. ఫలితంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటారు?
ఇలాంటి వాటి వల్ల కలరా వంటివి ప్రబలే అవకాశం ఉంది. ఫలితంగా డీ హైడ్రేషన్ అవుతుంది. చిన్నారుల్లో మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. జాండీస్, కలరా, టైఫాయిడ్ వంటి వాటితో పాటు మలేరియా, డెంగీ వంటివి సైతం సోకే అవకాశం ఉంది.
- ఓవైపు కరోనా మహమ్మారి.. మరోవైపు వరదలు ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపనున్నాయి?
కరోనా నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. అది శుభ సూచికం. సాధ్యమైనంత వరకు భౌతిక దూరం పాటించటంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారు. కరోనా జాగ్రత్తల వల్ల అంటువ్యాధులు సైతం కొంత తగ్గే అవకాశం ఉంది. ప్రజల అప్రమత్తతే వారి ఆరోగ్యానికి ప్రధాన రక్ష. గాంధీ, కింగ్ కోఠి, టిమ్స్ ఆస్పత్రులు మినహా ఇతర ప్రాంతాల్లో జనరల్ ఓపీపై దృష్టి సారించాం. ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో డెంగీ, స్వైన్ ఫ్లూ వంటివి వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకున్నాం.
- వరదల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి కేటీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకున్నారా?
అన్ని శాఖల అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఆరోగ్య శాఖ తరఫున తీసుకోవాల్సిన చర్యలపై పలు సలహాలు ఇచ్చారు. ఎమర్జెన్సీ శాఖల వారు సెలవులు లేకుండా పని చేయాలని మంత్రి ఈటల సూచించారు.
ఇదీ చూడండి: