ప్రాంతీయ పార్టీలతో కలిసి త్యాగాలకు తాము సిద్ధంగా లేమని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో.. రైతులను మోసగించడంలో ప్రాంతీయ పార్టీలు ఒకదానికి మించి మరొకటి ప్రావీణ్యం సంపాదించాయని ఆరోపించారు. కుటుంబ పార్టీలకు తాము వ్యతిరేకమని..,వాటితో కలిసి ముందుకు సాగబోమని వ్యాఖ్యనించారు.
కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర సమావేశాలకు జాతీయ అధ్యక్షుడు రాజ్ కుమార్ చాహర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయటం లేదని సోము మండిపడ్డారు. రైస్ మిల్లర్ల చేతిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని... పౌరసరఫరాల సంస్థను మిల్లర్లు నియంత్రిస్తున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్ల సంఘం నాయకుణ్ణి సివిల్ సప్లైయ్ ఛైర్మన్‌గా ఎలా నియమిస్తారని సోము వీర్రాజు ప్రశ్నించారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతుల అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు.
మోదీ పేరంటేనే భయపడతారు.. ‘ప్రధాని మోదీ రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తుంటే వాటిని రాష్ట్రంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అమలు చేయడం లేదు. పలు పథకాల నిధులను ఇతర పేర్లతో మళ్లిస్తోంది. మోదీ పేరు అంటేనే జగన్‌రెడ్డి భయపడతారు’ అని అఖిల భారత కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్‌కుమార్ చాహర్ పేర్కొన్నారు. త్వరలో అమరావతిలో వేలాది మంది రైతులతో ధర్నా నిర్వహించనున్నామని, దానికి తాను హాజరవుతానని చెప్పారు.
విజయవాడలో ఆదివారం కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయడం లేదని, రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర పథకాలను జగన్‌రెడ్డి అమలు చేయని తీరు, వాటిని మళ్లిస్తున్న వైనాన్ని రైతులు, ప్రజలకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి: