కర్నూలు జిల్లా నంద్యాలలో సలాం కుటుంబ ఆత్మహత్య వ్యవహారంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను అరెస్టు చేయడం ఏమిటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. తెదేపా, వైకాపాలు మతపరమైన రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.
పుష్కరాలను నిర్లక్ష్యం చేస్తోంది
విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలను ప్రశ్నిస్తే తమపై హిందుత్వ ముద్ర వేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన విదేశీ విద్య పథకానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వడం లేదని.., దీనివల్ల విదేశాల్లో ఉన్న విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తుంగభద్ర పుష్కరాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. ఘాట్ల నిర్మాణం చేయనప్పుడు రూ. 200 కోట్ల రూపాయల నిధులు ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. నదిలో పుష్కరస్నానాలు చేయొద్దనడం సరికాదని.. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.
పోలవరాన్ని కేంద్రం నిర్మించి తీరుతుంది
రాష్ట్రంలో ఎర్ర చందనాన్ని స్మగ్లర్లు సాధారణ కలపలాగా తరలిస్తున్నారని.. స్మగ్లర్ల విచ్చలవిడితనానికి ప్రభుత్వానికి సహాయం చేస్తోందా? అనే అనుమానం కలుగుతోందని సోము వీర్రాజు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎర్రచందనం అక్రమ రవాణాను నియంత్రించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అపోహలు సరికాదని.. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని నిర్మించి తీరుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అంచనాలు ఎందుకు పెరిగాయనే విషయంలో సమగ్ర దర్యాప్తు అవసరమని అన్నారు. కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తోందనే విషయాన్ని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఎందుకు చెప్పడం లేదని సోము వీర్రాజు ప్రశ్నించారు.
ఇవీ చదవండి..