పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల సంఖ్య పెంచాలనే యోచన సరికాదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. విజయనగరం, నెల్లూరు, కడప, శ్రీకాకుళం లాంటి జిల్లాలను విభజించి పెంచాల్సిన అవసరం లేదన్నారు. అనంతపురం, చిత్తూరు, కృష్ణ, గుంటూరు, విశాఖపట్టణం, గోదావరి లాంటి పెద్ద జిల్లాలను విభజించినా ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లా అనడంలో న్యాయం లేదన్న సోమిరెడ్డి...2026లో మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల హద్దులు మారిపోతాయని అప్పుడు మళ్లీ జిల్లాలను మారుస్తారా అంటూ ప్రశ్నించారు.
తెలంగాణలో జిల్లాల సంఖ్య పెంచి ప్రాముఖ్యత లేకుండా చేసేశారని సోమిరెడ్డి విమర్శించారు. జిల్లా అంటే ఒక విలువ ఉండాలన్న ఆయన...నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని విభజిస్తే కృష్ణపట్నం పోర్టు, షార్, శ్రీసిటీ అన్నీ తిరుపతి పరిధిలోకి పోయి నెల్లూరు ప్రాముఖ్యతను కోల్పోతుందన్నారు. ప్రజలకు చిరస్థాయిగా ఉపయోగపడేలా, సౌకర్యవంతంగా జిల్లాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వానికి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.