అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది జగన్ ప్రభుత్వం వ్యవసాయానికి బడ్జెట్లో 20వేల కోట్లకుపైగా కేటాయించి... 37శాతం మాత్రమే ఖర్చుపెట్టి పెట్టిందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. 63 శాతం నిధులు నిరూపయోగం చేశారని మండిపడ్డారు. రెండో ఏడాది వ్యవసాయానికి 22వేల కోట్లు బడ్జెట్ కేటాయించి వాళ్లు...అవన్నీ ఖర్చు చేసి చూపాలని సవాల్ విసిరారు. తొలిఏడాది 20వేల కోట్ల బడ్జెట్లో 7వేల కోట్లు మాత్రమే వ్యవసాయానికి ఖర్చు చేసి రైతు దినోత్సవం అనటం విడ్డూరమని మండిపడ్డారు.
వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన ఎన్నో ప్రాథమిక కార్యక్రమాలు నిలిపివేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసార పరీక్షలు నిర్వహించకుండా, ఉద్యాన పంటలకు ఉపకరించే సూక్ష్మ, బిందు, తుంపర సేద్యాలను పక్కనపెట్టారని ఆక్షేపించారు. ప్రకృతి సేద్యాన్ని నిరూపయోగం చేసి, విత్తన సరఫరాలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.