రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, జాతీయ రహదార్లు, ఇతర మౌలిక ప్రాజెక్టులు వచ్చే నాలుగేళ్లలో ప్రైవేటు అజమాయిషీ కిందకు వెళ్లిపోనున్నాయి. దీంతో రానున్న మూడేళ్లలో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. దాదాపు రూ.6 లక్షల కోట్లు సమీకరించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు మౌలిక సదుపాయాలను ప్రైవేటు సంస్థల నిర్వహణకు అప్పగించాలని ప్రతిపాదించిన సంగతి విదితమే. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మౌలిక ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.
* నాగ్‌పుర్ నుంచి బెంగళూరు వరకు ఉన్న జాతీయ రహదారిని పలు ప్యాకేజీల కింద ప్రైవేటు నిర్వహణకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రహదారి మహారాష్ట్ర నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా కర్ణాటక చేరుతుంది.
* రెండు రాష్ట్రాల్లోని ఎఫ్‌సీఐ గోదాములు, విద్యుదుత్పత్తి, విద్యుత్తు ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులు, కేజీ బేసిన్ గ్యాస్ పైప్‌లైన్, బీఎస్‌ఎన్‌ఎల్ టెలికాం టవర్లు, భారత్‌నెట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్‌వర్క్.. తదితర మౌలిక వసతుల ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమంలో చేర్చింది.
50 నుంచి 99 ఏళ్ల లీజుపై..
ఆస్తి విలువ లేదా ఆస్తి పుస్తక విలువ, మార్కెట్‌లో అటువంటి ఆస్తులకు ఉన్న విలువ.. వంటి పద్ధతుల్లో వీటికి విలువ కట్టి, ఆపై వాటిని నిర్వహించడానికి ముందుకు వచ్చే ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారు. రైల్వేస్టేషన్లను నిర్వహించేందుకు ముందుకు వచ్చే సంస్థలకు 50 నుంచి 99 ఏళ్ల పాటు అప్పగించడమే కాకుండా స్టేషన్ల అభివృద్ధి హక్కులు కల్పిస్తారు. బదులుగా ఆ సంస్థలు ప్రభుత్వానికి వార్షిక ఫీజు లేదా ముందుగా ఒకేసారి కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
* సికింద్రాబాద్ కేంద్రంగా ప్రైవేటు రైళ్ల నిర్వహణకు అవకాశం కల్పించనున్నారు. దీనివల్ల 35 ఏళ్ల పాటు ప్రైవేటు రైళ్లు నిర్వహించే అవకాశం ప్రైవేటు సంస్థలకు లభిస్తుంది. దీనిబట్టి వివిధ ప్రాంతాలకు ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించినట్లుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రైవేటు రైళ్లలో ప్రయాణించే అవకాశం రాబోతోంది. ఇదేవిధంగా పలు ఇతర ప్రాజెక్టులతో పాటు మూడు విమానాశ్రయాలను ప్రైవేటు నిర్వహణకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
జాతీయ రహదారి ప్రాజెక్టు విభాగాలు (2022 నుంచి 2025 మధ్యకాలంలో చేపడతారు)
* తెలంగాణలోని కొత్తకోట బైపాస్ - కర్నూలు (77 కిలోమీటర్లు)
* హైదరాబాద్ - బెంగళూరు (ఆరు సెక్షన్లు, 68 కిలోమీటర్లు)
* హైదరాబాద్-బెంగళూరు (ఎన్‌ఎస్-2/బీఓటీ/ఏపీ-7) (75 కిలోమీటర్లు)
ఇతర ప్రాజెక్టులు
* గెయిల్ (గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) అజమాయిషీ కింద ఉన్న 889 కిలోమీటర్ల పొడవైన కేజీ బేసిన్ పైప్‌లైన్ నెట్‌వర్క్.
* భారత్‌నెట్ ఫైబర్ ప్రాజెక్టు, బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌లో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కేబుల్ నెట్‌వర్క్, టెలికాం టవర్లు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు పరం కానున్న మౌలిక రంగ ప్రాజెక్టులు
* తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్ల అభివృద్ధి
* సికింద్రాబాద్ కేంద్రంగా ప్రైవేట్ రైళ్ల నిర్వహణ ప్రాజెక్టు
* 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు నిర్వహణకు ఇచ్చే విమానాశ్రయాలు: విజయవాడ (మూలధన అంచనా: రూ.600 కోట్లు), తిరుపతి (మూలధన అంచనా: రూ.260 కోట్లు). 2025 ఆర్థిక సంవత్సరంలో రాజమండ్రి విమానాశ్రయం (అంచనా: రూ.130 కోట్లు)
* విశాఖపట్నం నౌకాశ్రయంలోని 4 ప్రాజెక్టులు
ఇదీచదవండి.