రుణాలు ఇవ్వలేదని కృష్ణా జిల్లాలోని బ్యాంకుల ఎదుట పారిశుద్ధ్య కార్మికులు చెత్తపోసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం, ఉయ్యూరులో ఉన్న బ్యాంకుల ఎదుట గురువారం పారిశుద్ద్య కార్మికులు చెత్త పోశారు. ఇలాంటి వరుస ఘటనలు చూసిన బ్యాంకు అధికారులు నివ్వెరపోయారు.
రుణాలు మంజూరు చేయటం లేదని..
ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు రుణాల మంజూరులో సంబంధిత బ్యాంకులు సరిగా వ్యవహరించడం లేదంటూ...బ్యాంకు ద్వారాల వద్ద పురపాలకశాఖ అధికారుల పేరిట నోటీసులు అంటించారు. విజయవాడ యూనియన్ బ్యాంకు జోనల్ కార్యాలయంతోపాటు మరో రెండు చోట్ల చెత్తాచెదారాలతో నిండిన పారిశుద్ధ్య వాహనాలను నిలిపి ఉంచారు. బ్యాంకు లోపలికి వెళ్లే మార్గంలో చెత్త పారబోశారు. ఉయ్యూరులో యూనియన్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణాల వద్ద చెత్తపారబోయించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే..
పురపాలక కమిషనర్ ఆదేశాల మేరకే తాము చెత్తపారబోశామని బ్యాంకు ప్రతినిధులకు పారిశుద్ధ్య కార్మికులు తెలిపారు. ప్రభుత్వ పథకాలకు రుణాల మంజూరులో అలసత్వం ప్రదర్శించిన బ్యాంకులపై ఈ తరహా పోరాటానికి దిగాలని ఉన్నతాధికారులే ఆదేశించినట్లు చెప్పటం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. ఈ తరహా చర్యలకు పాల్పడడాన్ని బ్యాంకు ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది.
ఇక ముందు జరగదు..
బ్యాంకుల ముందు చెత్త వేయటం దురదృష్టకరమని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయట్లేదని కొంతమంది పారిశుద్ధ్య సిబ్బంది బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటన తమ దృష్టికి వచ్చిందన్నారు. సంబంధిత మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడి చెత్తను తీసివేయించామని వెల్లడించారు. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటుచేసి ఈ సమస్య పరిష్కరిస్తామన్నారు . ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు.
ఇదీచదవండి
ప్రభుత్వ పథకాలకు రుణాలు ఇవ్వలేదనే కక్షతో చెత్తపోస్తారా ?: ఏఐబీఈఏ