ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు కోతలు విధిస్తున్నారని తెరాస అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. శ్రీశైలం నీటిని అడ్డగోలుగా వాడినందుకే తెలంగాణకు మిగులు కరెంటు వచ్చిందన్నారు. హైదరాబాద్ లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడం ద్వారా ఏపీలో అంధకారం అలుముకుంటుందనే విషయాన్ని ముందే చెప్పామని.. ఈ విషయంలో కేసీఆర్ చెప్పింది వాస్తవమేనన్నారు. రాష్ట్రం విడిపోతే ఏపీ పరిస్థితి దారుణంగా ఉంటుందని, నీటి సమస్యలు వస్తాయని గతంలో చెప్పామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టాలని ఏపీ ప్రజలు కోరుతున్నారని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా సజ్జల స్పందించారు. కేసీఆర్.. ఏపీలో పార్టీ పెడతానంటే ఎవరైనా వద్దన్నారా? పార్టీ పెట్టొద్దని ఎవరూ చెప్పలేదన్నారు. రాజకీయ పార్టీని ఎవరైనా ఎక్కడైనా పెట్టొచ్చని.. దానికి ఎవరి అనుమతులు అవసరం లేదని పేర్కొన్నారు. ఎవరైనా రావచ్చని, ఎక్కడైనా పోటీ చేయొచ్చన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోకుండా ఉండి ఉంటే దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేదని సజ్జల అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా ఇస్తామని భాజపా మోసం చేసిందని ఆరోపించారు. ఎయిడెడ్ స్కూళ్ల ఆందోళన వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని ఆయన ఆక్షేపించారు. ఎయిడెడ్ పాఠశాలల అప్పగింతలో బలవంతం లేదని.. యాజమాన్యాలు ప్రభుత్వ పోస్టులను సరెండర్ చేసి పాఠశాలలను నడుపుకోవచ్చని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Cm Kcr: 'అట్ల నేనెప్పుడు అన్న..నేను అనలే'..కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు