Sajjala Comments: పీఆర్సీ సాధన కోసం ‘చలో విజయవాడ’ పేరిట ఉద్యోగులు బలప్రదర్శన చేపట్టడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారానికి నేరుగా చర్చలు జరుపుదామని సూచించారు. సమస్యను జఠిలం చేసుకోవద్దని సజ్జల హితవు పలికారు.
‘‘సమ్మెలు చేస్తే ప్రభుత్వం మెడలు వంచొచ్చనేది వాళ్ల అభిప్రాయం. ఉద్యోగులు తమ కార్యాచరణ పక్కన పెట్టాలని చెప్పాం. సమ్మెకు వెళ్లకముందే రోడ్డెక్కడం సరైన పద్ధతి కాదు. రేపు ఉద్యోగులు చేసేది బలప్రదర్శనే. వైషమ్యం పెంచుకోవడం ద్వారా ఏం చేస్తారు. ఆందోళనలో సంఘ విద్రోహ శక్తులు చొరబడే ప్రమాదం ఉంది. ఆందోళనపై ఉద్యోగ సంఘాల నాయకులు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. సీపీఎస్,అవుట్ సోర్సింగ్ ఒక పట్టాన తెగేవి కాదు.ఆర్టీసీ వారి సమస్యలు పరిష్కారానికీ చర్యలు తీసుకుంటుండగానే వారినీ తీసుకువచ్చారు" -సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
ఆ డిమాండ్లు నెరవేర్చడం కుదరదు..
ఉద్యోగ సంఘాలు చేస్తోన్న మూడు డిమాండ్లకు కాలం చెల్లిందని.. ఇప్పటికే ఉద్యోగుల అకౌంట్లల్లో వేతనాలు పడ్డాయని.. సజ్జల తెలిపారు. రెండు డిమాండ్లు నెరవేర్చడం సాధ్యపడదన్నారు. మిగిలిన డిమాండ్ అయిన పీఆర్సీ రిపోర్టు ఇవ్వడం వల్ల లాభం లేదని ఆయన అన్నారు. పట్టుబట్టే బదులు ప్రధాన సమస్యలపై చర్చలకు రావాలని అడిగామని సజ్జల తెలిపారు. డిమాండ్లు తీర్చడానికి అవకాశం లేదన్నారు. ఉద్యోగ సంఘాలు అసలు సమస్యలపై మాట్లాడేందుకు రావాలని.. కార్యాచరణ వాయుదా వేసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఇప్పటివరకు నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు.
ఆర్టీసీని కలిపినా ఆందోళనలు చేస్తామంటున్నారు..
ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపినా ఆందోళన చేస్తామంటున్నారని సజ్జల తెలిపారు. ఆర్టీసీ వారిని కూడా తీసుకువచ్చి, బస్సులు ఆపి బల ప్రదర్శన చేయాలని చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వం.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ఉద్యోగులపై చర్యలు తీసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని కోరారు.
ఉద్యోగులకు ఏ విధంగా చూసినా వేతనం కచ్చితంగా పెరుగుతుంది. కోవిడ్ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతున్నాం. ఉద్యోగులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వెలగపూడి నుంచే పరి పాలన సాగుతుంది.టెక్నికల్ గా ప్రస్తుతం పాలన ఎక్కడినుంచి జరుగుతుందో అదే ప్రస్తుత రాజధాని అవుతుంది. భవిష్యత్తులో రాజధాని మార్పు ఉంటుంది. కేంద్రం బడ్జెట్ లో ఏటా రాష్ట్రానికి అన్యాయమే చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యల పై ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని చెప్పడం లేదు. మార్పులకు అవకాశం ఎప్పుడూ ఉంటుంది. చర్చలకు వచ్చి పరిష్కరించుకోవాలని ఉద్యోగులను కోరుతున్నాం. గతంలో తెదేపా.. భాజపా తో పార్ట్నర్ గా ఉన్నా రాష్ట్రానికి అన్యాయం చేశారు. జగన్ వల్లే ప్రత్యేక హోదా సజీవంగా ఉంది. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యల వల్ల పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవచ్చు. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసం కూడా ఉండొచ్చు.. దీనిపై చర్చ జరగాలి. -సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
ఇదీ చదవండి:
CM Review: ఉద్యోగులకు మంచి జరగాలని సర్వీసు పెంచాం: సీఎం జగన్