భాజపా-జనసేన కలయికతోనే సామాజిక న్యాయం సాధ్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడలో జరిగిన భాజపా-జనసేన సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. దేశ, రాష్ట్ర శ్రేయస్సు కోసం భాజపాతో కలిసి పనిచేసేందుకు జనసేన ముందుకొచ్చిందని కన్నా తెలిపారు. 2024లో అధికారమే లక్ష్యంగా భాజపా-జనసేన కలిసి పనిచేస్తాయన్న కన్నా... జనసేన-భాజపా కలయిక చారిత్రకమైనదన్నారు. ఇరు పార్టీలు అధికారంలోకి రావటమే లక్ష్యంగా పోరాడతామన్నారు. సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు పోతున్నారని కన్నా విమర్శించారు. సీఎం జగన్ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. అమరావతిపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని కన్నా తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని భాజపా మొదట్నుంచీ కోరుతుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా కలిసి పోరాడతామన్నారు.
తెదేపా తప్పులు చూపించి ఒక్క ఛాన్స్ అంటూ వైకాపా అధికారంలోకి వచ్చిందని కన్నా అన్నారు. వైకాపా పాలనలో కుటుంబం, కులం, అవినీతి ఎక్కువయ్యాయన్న కన్నా.. ఆ విషయాల్లో తెదేపా, వైకాపా ఒకటేనని ఆరోపించారు. మోదీ నాయకత్వంపై నమ్మకంతోనే పవన్ ముందుకొచ్చారని స్పష్టం చేశారు. జగన్ నియంతృత్వ పోకడలు దృష్టిలో పెట్టుకుని రెండు పార్టీలు కలిశాయన్నారు. రాష్ట్రంలో 7 నెలలుగా జరుగుతున్న పరిణామాలన్నీ చర్చించామని కన్నా తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అవినీతిపైనా చర్చించామని స్పష్టం చేశారు. అవినీతిరహిత పాలన కోసమే జనసేన-భాజపా కలిసి నడవాలని నిర్ణయించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు.
ఇదీ చదవండి :