లాక్ డౌన్ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్లు సహా ఆర్టీసీ పరిధిలో ఉండే అన్ని దుకాణాల లైసెన్స్ ఫీజును ఏపీఎస్ఆర్టీసీ మాఫీ చేసింది. గతేడాది మార్చి 22 నుంచి జూన్ 7 వరకు ఫీజు రద్దు చేస్తూ ఆర్టీసీ ఎండీ ఎం.టి. కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు. లాక్ డౌన్ కాలంలో బస్సులు నిలిచిపోవడం, దుకాణాలు మాసి ఉంచడం వల్ల లైసెన్సు మాఫీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. బస్టాండ్ సమీపంలో రహదారులకు అభిముఖంగా ఉన్న దుకాణాలకు.. జూన్ 8 నుంచి ఆగస్టు 31 వరకు లైసెన్సు ఫీజులో సగం వసూలు చేయనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి అన్ని దుకాణాల నుంచి పూర్తి లైసెన్సు ఫీజు వసూలు చేస్తారు. లాక్ డౌన్ ముందు మార్చి నెలలో కేవలం 21 రోజులకు మాత్రమే ఫీజు వసూలు చేస్తారు.
బకాయిల మాటేమిటి...?
దుకాణదారులు బకాయి పడిన మొత్తాన్ని చెల్లించేందుకు జరిమానాను ఆర్టీసీ తొలగించింది. జూన్ 8 నుంచి ఈనెలాఖరు వరకు ఉన్న బకాయిలను జరిమానా లేకుండానే చెల్లించే సదుపాయం కల్పించింది. బకాయిల వసూలు కోసం ఈనెల 20 లోపు డిమాండ్ నోటీసులు పంపాలని.. అన్ని జిల్లాల అధికారులకు సంస్థ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. దుకాణ యజమానులు ఈ నెలాఖరు లోగా బకాయిలను చెల్లించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గడువులోగా బకాయిలు చెల్లించకపోతే నిబంధనల ప్రకారం జరిమానా వసూలు చేయనున్నట్లు తెలిపారు.
సాధారణ సెలవులపైనా నిర్ణయం...
2021 ఏడాదికి సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులకు సాధారణ సెలవులను సంస్థ ప్రకటించింది. జోన్ల వారీగా సెలవుల వివరాలతో ఎండీ కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులందరూ జనవరి 1, 2020 నుంచి ప్రభుత్వ సేవలో కలిసిపోగా.. ప్రభుత్వం ప్రకటించిన సెలవులు సంస్థకు చెందిన అన్ని పరిపాలనా కార్యాలయాలకూ వర్తిస్తాయని ఉత్తర్వుల్లో తెలిపారు. ఫ్యాక్టరీల చట్టం, రెగ్యులర్ ప్రాక్టీస్ ప్రకారం.. సంస్థలో పనిచేస్తున్న అందరు ఉద్యోగులకు.. ఈ ఏడాదిలో 16 సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు వర్క్‌షాప్‌లు.. జోనల్ స్టోర్స్ కార్యాలయాల్లో పనిచేసే వారికి సెలవుల జాబితాను ప్రకటించి అమలు చేయాలని అన్ని జిల్లాల్లోని అధికారులకు ఆదేశాలు అందాయి.
ఇదీ చదవండి:
'2024నాటికి అన్ని ప్రభుత్వ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్పు'