విజయవాడను వాననీటి కష్టాల నుంచి తప్పించడానికి రూ.461 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో 2017లో పథకం ప్రారంభమైంది. ఇప్పటికీ.. డ్రెయిన్ల నిర్మాణ పనులు అసంపూర్తిగానే కనిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో జరగాలంటే ఈ నిధులు చాలవు. ఈ పనులు పూర్తయినా ఫలితం అంతంతమాత్రమే. 2010 నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా ఎక్కడ వేసి గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
ఇప్పటి వరకు కేవలం 57 శాతం పనులే అయ్యాయి. ఒప్పందం ప్రకారం మొత్తం 443.75 కి.మీ మేర మురుగునీటి కాలువలను నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు మేజరు డ్రెయిన్లు.. 56.24 కి.మీ, మైనర్ డ్రెయిన్లు.. 195.90 కి.మీ చొప్పున 252.14 కి.మీ మాత్రమే పూర్తి చేయగలిగారు. పలు చోట్ల రోడ్ల వెడల్పు, ఆక్రమణల తొలగింపు కారణంగా 60 డ్రెయిన్ల నిర్మాణంలో ఆలస్యం జరిగింది. దీనికి తోడు రెండు చోట్ల కోర్టు కేసులు కూడా తోడయ్యాయి.
రైల్వే, ఎన్‌హెచ్‌ఏఐ, రహదారుల శాఖ నుంచి అనుమతులు రావడంలో జాప్యం జరిగింది. తాగునీటి, విద్యుత్తు లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపు పనులు సజావుగా జరగలేదు. వివిధ ప్రాంతాల్లో స్థానికులు, ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు రావడంతో పలు సార్లు డిజైన్లను మార్చాల్సి వచ్చింది. దాదాపు 500 పైగా ప్రాంతాల్లో మేజర్, మైనర్ డ్రెయిన్ల అనుసంధాన ప్రక్రియ అసంపూర్తిగా నిలిచింది. దీని వల్ల నీరు సక్రమంగా ముందుకు పోవడంలేదు.
పలుచోట్ల కల్వర్టుల నిర్మాణపు పనుల మధ్యలోనే ఆగిపోయాయి. ఫలితంగా వర్షపు నీరు ఎక్కడిక్కడ నిలిచిపోతోంది. వివిధ ప్రాంతాల్లో ధ్వంసమైన ప్రహరీలు, ఇతర నిర్మాణాల వల్ల నీరు ముందుకు కదలడం లేదు. నగరంలో నిత్యం పోగయ్యే పలు రకాల వ్యర్థాలు డ్రెయిన్లలోకి చేరుతున్నాయి. రోడ్లపై చెత్తను నగరపాలక పారిశుద్ధ్య సిబ్బంది కొన్ని చోట్ల సరిగా తొలగించక, దాన్ని డ్రెయిన్లలోకి నెట్టేస్తున్నారు. దీని వల్ల వర్షాలు పడినప్పుడు నగరం జలమయం అవుతోంది.