విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న రాతి వంతెనను ప్రీ కాస్ట్ రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ బాక్సులతో విజయవంతంగా పునర్నిర్మించారు. ఎనిమిది గంటల వ్యవధిలో ఒంగోల్-కరావాడి విభాగం మధ్య డౌన్లైన్లో ఈ నిర్మాణం పూర్తి చేశారు. లాక్‌డౌన్ సమయంలో డివిజన్ పరిధిలోని ఐదు ప్రధాన వంతెన మరమ్మతులు, పునర్‌నిర్మాణాలను పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పనులు పూర్తి చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజనల్ ఇంజినీరు సంజీవ్ కుమార్ తెలిపారు.
కరోనా ప్రతికూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, విధుల్లో పాల్గొనే కార్మికుల్ని క్షుణ్ణంగా పరీక్షించడం, వారికి పీపీఈ కిట్లు, శానిటైజర్లు అందించి... పని సమయంలో భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించడం ద్వారా అన్ని భద్రతా జాగ్రత్తలు చేపట్టామని తెలిపారు. తద్వారా డివిజన్ పరిధిలో రికార్డు సమయంలో ప్రధాన ట్రాక్లు, వంతెన మరమ్మతులను చేయగలిగామన్నారు.
లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకొని విజయవాడ డివిజన్ నాలుగు ప్రధాన వంతెన బ్లాకులు పూర్తి చేశామన్నారు. సిగరాయకొండ-టంగూటూరు, రాజమండ్రి-విశాఖపట్నం సెక్షన్ మధ్య రెండు వంతెనలు, విజయవాడ యార్డ్ వద్ద సిజర్స్ క్రాస్ఓవర్ను స్లీపర్లతో భర్తీ చెయ్యగలిగామన్నారు. లాక్‌డౌన్ కాలంలో ఇలాంటి కీలకమైన పనులు చేసినందుకు ఇంజినీరింగ్ బృందాన్ని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ పి.శ్రీనివాస్ అభినందించారు.