రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల మంజూరు అంశాన్ని కేంద్ర పర్యావరణశాఖ వాయిదా వేసింది. ఈ పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కేంద్ర పర్యావరణశాఖ పరిధిలోని నిపుణుల మదింపు కమిటీ (ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ) ఆరు అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం కోరింది. వాటిని పరిశీలించాకే నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడించింది. కర్నూలు జిల్లాలోని గాలేరు-నగరి సుజలస్రవంతి ప్రాజెక్టు, శ్రీశైలం కుడిగట్టు కాలువ, తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రోజుకు 3 టీఎంసీల నీరు ఎత్తి పోసేందుకు వీలుగా తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం పెట్టుకున్న దరఖాస్తుపై ఈ కమిటీ కూలంకషంగా చర్చించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పైన పేర్కొన్న మూడు ప్రాజెక్టుల్లో అంతర్భాగంగా చేరుస్తూ శ్రీశైలం కుడిగట్టు కాలువకు 1988 సెప్టెంబరు 19న కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతులను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
సవరణలు చేస్తే చాలు..
రాష్ట్ర విభజన తర్వాత కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 512 టీఎంసీల నీటిలో 101 టీఎంసీలు ప్రస్తుతం రాయలసీమలోని పథకాలకు ఉపయోగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ నీటిని రోజుకు 3 టీఎంసీల చొప్పున తరలించడానికి రూ.3,825 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించినట్లు పేర్కొంది. ఇందులో ఫోర్‌బే, పంప్‌హౌస్, పైప్‌లైన్, అప్రోచ్ ఛానల్ ఉంటాయని తెలిపింది. ఈ ప్రాజెక్టు తొలి ప్రతిపాదనల్లో కొన్ని మార్పులు చేసినందున ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరమైనట్లు పేర్కొంది. ఈ పథకం కొత్తదేమీ కాదని, శ్రీశైలం రిజర్వాయరులో నీటిమట్టం 854 అడుగుల కంటే తగ్గినప్పుడు ఇప్పటికే ఉన్న పథకాలకు నీరు అందించడానికి ఉద్దేశించినట్లు తెలిపింది. శ్రీశైలం, తెలుగుగంగ, గాలేరు-నగరి ప్రాజెక్టులకు ఇప్పటికే పర్యావరణ అనుమతులు తీసుకున్నందున వాటిలో సవరణలు చేస్తే సరిపోతుందని విజ్ఞప్తి చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ 2020 అక్టోబరు 29న ఈ ప్రాజెక్టు విషయంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ జారీచేసిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొంది.
ప్రభావం ఎలా ఉంటుంది?
సాగునీటి కాలువల విస్తరణ వల్ల పర్యావరణంపై ఎంతమేర ప్రభావం పడుతుంది? శ్రీశైలంలో 854 అడుగుల కింది నుంచి నీటిని తోడినప్పుడు తలెత్తే పరిణామాలేంటి? భూగర్భ నిర్మాణాలపై పడే ప్రభావం ఎంత? సున్నితమైన ప్రాంతాలపై పర్యావరణపరంగా పడే ప్రభావం ఏంటి? అని ప్రశ్నించినట్లు కమిటీ గుర్తుచేసింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులిచ్చే ముందు పర్యావరణ ప్రభావ మదింపు చేయాలని ట్రైబ్యునల్ సూచించినట్లు పేర్కొంది. ఇందుకోసం కొత్తగా భూసేకరణ ఏమీ చేపట్టకున్నా.. తమకు సమర్పించిన లేఅవుట్ డ్రాయింగ్స్‌లో అప్రోచ్ ఛానల్, లింక్ కెనాల్‌ను సరిగా చూపలేదని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. అందువల్ల ఈ వివరాల ఆధారంగా పర్యావరణ ప్రభావాలను అంచనా వేయడం కష్టమంది. పైగా శ్రీశైలం, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులకు ఇచ్చిన పర్యావరణ అనుమతుల్లో ఏ భాగాన్ని సవరించాలని కోరుతున్నదీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదని అభిప్రాయపడింది. గతంతో పోలిస్తే ప్రస్తుత పథకంలో మార్పులు, చేర్పులు చేయడంతోపాటు, ఎన్‌జీటీ లేవనెత్తిన అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై మదింపు చేయడానికి ఆరు అంశాలపై అదనపు సమాచారం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది.
- ప్రాజెక్టు లేఅవుట్‌కు సంబంధించిన స్పష్టమైన డ్రాయింగ్స్ సమర్పించాలి. అందులో ప్రస్తుతం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న అన్ని విభాగాలనూ చూపాలి.
- ఎన్జీటీ పరిధిలో ఉన్న దానికి, ఇప్పుడు చేసిన ప్రతిపాదనలను సరిపోల్చే డ్రాయింగులు, చార్టులు, లేఅవుట్లు ఇవ్వాలి.
- నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ముందు సమర్పించిన అంకెలకు, పరివేష్ పోర్టల్‌లో ఉన్న డీపీఆర్‌లోని లెక్కలకు తేడా ఉన్నందున నవీకరించిన డీపీఆర్ అందించాలి.
- భూ అవసరాలు, భూ వినియోగంలో చేసిన మార్పుల వివరాలు సమర్పించాలి.
- ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రాజెక్టుకు 10 కిలోమీటర్ల పరిధిలో పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతం వివరాలు అందించాలి.
- నీటి మళ్లింపు విధానాలు (వాటర్ విత్‌డ్రాయల్ మెథడ్స్)పై స్పష్టత ఇవ్వాలి. నీటి తరలింపునకు ఇప్పుడున్న రెండు విధానాలు కొనసాగిస్తారా? అన్నది చెప్పాంటూ పర్యావరణ అనుమతులపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. దీనిపై తదుపరి ఎప్పుడు చర్చించేదీ నిర్ణయించలేదు.
ఇదీచదవండి