RANGOLI IN AP: తెలుగు నాట ముగ్గులు లేని ముంగిళ్లను ఊహించలేం. ముగ్గులు సాంస్కృతిక వారసత్వ సంతకాలు. అతివల అనాది కళాచాతుర్యానికి సంకేతాలు. కోడికూతతోనే నిద్రలేచి, వాకిలి చిమ్మి, పేడనీటితో కళ్లాపి చల్లి ముంగిట్లో ముగ్గులు తీర్చిదిద్దడం... తెలుగిళ్లలో ఇదొక అనుదినచర్య. మొదటిపెద్ద పండుగైన సంక్రాంతికి వేసే రంగవల్లులతో తెలుగు వాకిళ్లు కళకళలాడుతుంటాయి.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా విజయవాడ ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు సరదాగా సాగాయి. అద్భుతమైన రంగవల్లులను అతివలు అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. సంక్రాంతి తత్వాన్ని, చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ముగ్గులు వేశారు. రకరకాల రంగులతో చూడచక్కగా ముస్తాబు చేశారు.
వివిధ రకాల ఆకృతుల్లో వేసిన ముగ్గులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నగరాలు, పట్టణాల్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసే అవకాశం లేదని పోటీల్లో పాల్గొన్న మహిళలు చెప్పారు. క్రమేపీ సంప్రదాయాలను మర్చిపోతున్న రోజుల్లో...ఇస్కాన్ వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని అంటున్నారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి కనుమ పండుగ రోజు వరకు వేసే ముగ్గులకు విశిష్ట నేపథ్యం ఉందని చెబుతున్నారు మహిళలు.
ఇదీచదవండి: