తమిళనాడు-శ్రీలంక తీరాలను ఆనుకుని నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 3.1 కిలోమీటర్ల ఎత్తున మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణశాఖ వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా కోస్తాంధ్రపై మరో ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని అధికారులు వెల్లించారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. రాయలసీమ, కోస్తాంధ్రల్లో చాలా చోట్ల.. శనివారం ఉరుములతో కూడిన జల్లులు పడతాయని పేర్కొంది.
విజయవాడలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. తమిళనాడు,శ్రీలంక తీరాలను అనుకుని నైరుతీ బుతుపవనాల అల్పపీడన ప్రభావం విజయవాడ నగరంలో స్పష్టంగా కనిపించింది. కృష్ణా జిల్లా గన్నవరం పరిసర ప్రాంతాల్లో.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
గుంటూరు నగరంలో గంటపాటు కురిసినవర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా నగరంలో రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరింది. నగర శివారు కాలనీలు నీట మునిగిపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. మూడు వంతెనల కూడలి వద్ద వర్షపు చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, రేపల్లె, చెరుకుపల్లి, తెనాలి, పొన్నూరు, భట్టిప్రోలు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.
నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జాతీయ రహదారిపై ప్రజలు రాకపోకలు సాగించడం ఇబ్బందికరంగా మారింది. పట్టణ పరిధిలోని పలు వీధుల్లో నీరు నిలిచింది.
ప్రకాశం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఒంగోలు పట్టణంలో కురుస్తున్న భారీ వర్షానికి పలు వీధులు జలమయమయ్యాయి.. గాంధీ రోడ్డు, బస్టాండ్ రోడ్డు , సుజాతనగర్, కర్నూల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై చేరటంతో.. వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో చినగంజాం, చీరాల, ఉలవపాడు, సింగరాయకొండ మండలాల్లో భారీగా వర్షం కురిసింది.
ఇదీ చదవండి:
BADVEL BY-POLL : బద్వేలు సమరానికి సర్వం సిద్ధం.. పోలీసు పహారాలో నియోజకవర్గం