రైళ్లలో ప్రయాణికులకు నాసిరకం ఆహారం సరఫరా చేస్తున్నారంటూ ఓ ప్రయాణికుడు విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజరుకు ఫిర్యాదు చేశాడు. విశాఖ నుంచి తిరుపతి వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు వస్తున్న చంద్రశేఖర్ ఏలూరు దాటిన తర్వాత రాత్రి ఏడు గంటల సమయంలో రైలులో అమ్ముతున్న బిర్యానీ ప్యాకెట్ కొనుగోలు చేశాడని... తినేందుకు నోట్లో పెట్టగానే ముద్ద దిగలేదని వాపోయాడు. సరిగా ఉడకని బియ్యంతో బిర్యాని దర్శనమిచ్చిందని ఆరోపించాడు. ఇదేంటని నిలదీస్తే తమపై దౌర్జన్యానికి దిగారని- డీఆర్‌ఎం, రైల్వే టోల్‌ఫ్రీకి ఆహార పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనేది వివరించాడు.
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని స్టేషన్లలో ఉండే హోటళ్ల ఆహారమే కాకుండా.. బయట నుంచి సైతం యథేచ్ఛగా తీసుకొచ్చి అమ్మే అనధికార హాకర్లు పెరిగిపోయారు. ప్రస్తుతం రైల్వే నుంచి క్యాంటీన్లు, హోటళ్లు అన్ని ఐఆర్‌సీటీసీ పరిధిలోనికి వెళ్లిపోయాయి. దీంతో పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి, విజయవాడ డీఆర్‌ఎం దృష్టికి విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విటర్ ద్వారా తీసుకెళ్లారు. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీకి ట్విట్టరులోనే అధికారులు బదులిచ్చారు..