విజయవాడ నగరం మీదుగా రోజూ లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. నగరం మీదుగా పలు జాతీయ రహదారులు అనుసంధానం అయ్యి ఉన్నాయి. ఇలాంటి చోట రోడ్లు నిర్వహణ మాత్రం సరైన రీతిలో లేదు. నగరంలో రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. బెజవాడలో దాదాపు 12 వందల కిలోమీటర్ల మేర రహదారులు ఉండగా..శివారు ప్రాంతాల్లో 176 కిలోమీటర్ల పరిధిలో కచ్చా రహదార్లు ఉన్నాయి. వీటిలో చాలా రోడ్లు ధ్వంసమయ్యాయి.
గతంలో ప్రభుత్వం విడుదల చేసిన 150 కోట్ల రూపాయల నిధులతో....రహదార్ల నిర్మాణం, పునరుద్ధరణకు ప్రతిపాదనలు ఉన్నా..పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్లుగా రోడ్ల మరమ్మతులకు తట్టెడు మట్టి కూడా పోసే వాళ్లు లేక అధ్వాన స్థితిలో నగర రహదారులు దర్శనమిస్తున్నాయి. ఎలాంటి ప్రమాదం బారిన పడతామో తెలియని పరిస్థితుల్లో....నగర వాసులు భయాందోళన చెందుతున్నారు.
కొన్ని నెలల క్రితం ఏర్పడిన చిన్నగుంతలు ఇప్పుడు పెద్ద గొయ్యలుగా మారాయి. వర్షాలకాలమైతే పరిస్థితి మరింత దారుణం. నిత్యం వాహనాలతో నగరంలో దుమ్మూధూళి విపరీతంగా పెరిగింది. రద్దీగా ఉన్న రహదారిపై నిరంతరం నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన అధికారులే.. నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఫ్లై ఓవర్ల నిర్మాణం జరిగి ట్రాఫిక్ సమస్య కొంత కొలిక్కి వచ్చినా....సర్వీస్ రోడ్లు అభివృద్ధి చేయకపోవటంపై మండిపడుతున్నారు.
పురపాలక ఎన్నికల్లో హామీలు గుప్పిస్తున్నా పార్టీలు రహదారుల విషయంపైనా స్పష్టత ఇవ్వాలని నగరవాసులు కోరుతున్నారు.ఈసారైనా అధికారులు, నేతలు చొరవ చూపి రహదారుల రూపు మార్చాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:
విజయనగరంలో ఆ యువతి కాళ్లు, చేతులు కట్టిపడేసింది ఎవరో తెలుసా..?