రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రాలు మార్చాలని, ఆరాధ్య నేత పేరు పెట్టాలని డిమాండ్ల చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు.
రంగా పేరు కావాలంటూ..
విజయవాడ కేంద్రంగా ఏర్పాటుచేసే జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని.. కాపు సంక్షేమ సంఘం, రంగా-రాధా రీఆర్గనైజేషన్ కమిటీ డిమాండ్ చేశాయి. ఇందుకోసం విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తామని నాయకులు తెలిపారు.
జిల్లాల ప్రకటన వెనుక ముడుపులు..
నరసాపురంను కాదని భీమవరాన్ని జిల్లా కేంద్రం చేయడానికి సీఎం జగన్‌తో పాటు ఎమ్మెల్యే ప్రసాదరాజుకు ముడుపులు ముట్టాయని.. మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు ఆరోపించారు. నరసాపురం కోసం ప్రజా ఉద్యమం చేపడతామని ప్రకటించారు.
సీఎం మాట నిలబెట్టుకోవాలి..
రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటుచేయాలంటూ.. కడప జిల్లా కలెక్టర్‌కు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంలో ప్రజల ఆవేదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని మేడా తెలిపారు.
ఇదీ చదవండి: TDP MP KANAKAMEDALA: ఎస్సీ వర్గీకరణపై రాజ్యసభలో ఎంపీ కనకమేడల
హిందూపురమే కావాలి..
హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ చిలమత్తూరులో అఖిలపక్షాలు ర్యాలీ నిర్వహించాయి. ర్యాలీ తర్వాత రోడ్డుపై బైఠాయించిన నాయకులు.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.
పోస్టుకార్డు ఉద్యమం..
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని గడివేముల మండలాన్ని నంద్యాల జిల్లాలో కలపాలంటూ.. పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. పెద్దసంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పోస్టాఫీస్ వద్దకు చేరుకొని.. కలెక్టర్‌కు పోస్టుకార్డులు పంపించారు. న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని చెప్పారు.
మహిళల ఊసేది..
కొత్త జిల్లాల్లో ఒక్క దానికి కూడా మహిళల పేర్లు పెట్టకపోవడంపై.. నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నింటా సగమైన మహిళలు.. జిల్లాల పేర్లకు మాత్రం గుర్తుకు రాలేదా అని రచయిత్రులు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: PAWAN KALYAN: పోలవరం పూర్తి చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా?: పవన్ కల్యాణ్
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!