కృష్ణా జిల్లాలో..
ప్రభుత్వం తీసుకున్న ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నగరంలోని సామాన్య మధ్యతరగతి ప్రజలకు శరాఘాతంగా మారే జీవో నెంబర్ 198 వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే దశల వారీగా తెదేపా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
నెల్లూరు జిల్లాలో..
రాష్ట్ర ప్రభుత్వం పన్నులు పెంచి ప్రజలపై భారం మోపడాన్ని నిరసిస్తూ తెదేపా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. పట్టణ సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నులు పెంచి ప్రజలపై భారాలు మోపడం దారుణమని సునీల్ కుమార్ విమర్శించారు.
సామాన్యుల నడ్డి విరిచేలా పన్నుల భారం పెంచేస్తున్నారని.. తెదేపా నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. పనులు లేక పట్టణాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారని. చెత్తపై పన్నులు వేయ్యవద్దని కోరారు.
కర్నూలు జిల్లాలో..
కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. వారిపై పన్నుల భారం మోపటం దారుణమని ఆ సంఘం సభ్యులు ఆరోపించారు. తెలంగాణలో ఏడాదిపాటు ఆస్తిపన్నుకు మినహాయింపు ఇచ్చారని.. రాష్ట్రంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లాలో..
పురపాలక సంఘాల్లో ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఆస్తిపన్ను విధానం రద్దు చేయాలని కోరుతూ.. శ్రీకాకుళం నగర పాలక సంస్ధ కార్యాలయం ఎదుట పట్టణ పౌరసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నూతన ఆస్తి పన్ను విధానాన్ని రద్దు చేయకపోతే.. ప్రజా మద్దత్తుతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఆ పని చేసి భాజపా నేతలు క్రెడిట్ తీసుకోవచ్చు: సజ్జల