కేంద్ర ప్రభుత్వ పథకమైన ఫేమ్ ఇండియాలో భాగంగా ఏపీలో 350 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, నిర్వహణకు ఏపీఎస్ఆర్టీసీ రూపొందించిన ఆర్ఎఫ్పీని జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు ప్రాతిపదికన రెండో దశలో350 ఎలక్ట్రిక్ , హైబ్రీడ్ బస్సులను రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పెట్రో, డీజిల్ ధరల మంటలు ఆర్టీసీని కూడా తాకడంతో ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఆర్థికంగా ఇబ్బందులు తప్పించేందుకు అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు హైబ్రీడ్, ఎలక్ట్రికల్ బస్సులను 12 ఏళ్ల పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన ఆర్టీసీ ప్రతిపాదిత రూట్లలో తిప్పేందుకు ఆసక్తి కలిగిన బిడ్డర్లను ఆహ్వానిస్తూ ఆర్ఎఫ్పీ విడుదల చేసింది.
ఇ-బస్సుల కొనుగోలు , నిర్వహణ వ్యయం వంద కోట్లు దాటడంతో ఆర్ఎఫ్పీని జ్యుడీషియల్ ప్రివ్యూకి ఏపీఎస్ఆర్టీసీ పంపింది. ఈ మేరకు ఆర్ఎఫ్పీపై అభ్యంతరాలను, సూచనలను పంపాల్సిందిగా జ్యుడీషియల్ ప్రివ్యూ తన వెబ్సైట్ ద్వారా కోరింది. పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండంతో ఆర్థికంగా సమీప భవిష్యత్తులో హైబ్రీడ్, ఎలక్ట్రిక్ బస్సులే మేలని ఏపీఎస్ఆర్టీసీ భావిస్తోంది. 12 మీటర్లు, 9 మీటర్లు పొడవైన ఏసీ ఎలక్ట్రిక్, హైబ్రీడ్ బస్సుల కొనుగోలు, నిర్వహణ కోసం ఆసక్తి ఉన్నవారు బిడ్లను దాఖలు చేయాల్సిందిగా ఆర్టీసీ కోరింది. విశాఖ డివిజన్ కు 100 బస్సులు, విజయవాడకు 50, గుంటూరు 50, కాకినాడ 50, తిరుపతి నగరంలో 50, తిరుమల ఘాట్ రోడ్ లో 50 ఎలక్ట్రిక్ బస్సులను చొప్పున కొనుగోలుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: Anandayya Medicine: కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య ఔషధం తయారీకి ఏర్పాట్లు