కార్తిక మాసంలో పూలు, పండ్లకు గిరాకీ అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ సీజన్‌లో ఆలయాలతోపాటు ఇళ్లలోనూ పూజకు రకరకాల పూలు వాడతారు. కానీ.. వర్షాల వల్ల పూల దిగుబడి బాగా తగ్గింది. దీంతో.. విజయవాడలోని పూల మార్కెట్లకు సరుకు రవాణా మందగించింది. కడప నుంచి బంతిపూలు, కర్ణాటక నుంచి పలు రకాల పూలు వచ్చినా.. అవి నాణ్యతగా ఉండటం లేదు.
వర్షాల కారణంగా పూలన్నీ తడిసిపోవటంతో.. వాటిని కొనేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపటం లేదు. చామంతి, బంతిపూలు, గుండుమల్లెలు, గులాబీ ఇలా అన్ని రకాల పూలతోటలు వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
అక్టోబర్-నవంబర్ మధ్య కాలంలోనే పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. కేజీ గులాబీలు 120, చామంతి 160 రూపాయలకు విక్రయిస్తున్నారు. పూల వ్యాపారం సీజన్లోనే బాగా సాగుతుంది. అలాంటిది భారీ వర్షాలు ముంచెత్తడంతో.. ఈసారి తీవ్రంగా నష్టపోయామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరుకు బాగుంటే రూపాయి ఎక్కువ పెట్టి అయినా కొనుగోలు చేస్తారని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని అంటున్నారు.
అటు రైతులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూలతోటలు దెబ్బతిని, వ్యాపారం సరిగా లేకపోవడంతో.. పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
ఇదీ చదవండి: Tomoto Price Hike: మోతెక్కుతోన్న టమాట ధర... జంకుతున్న సామాన్యులు