రాష్ట్రంలో బుధవారం రాత్రి అనధికారిక విద్యుత్తు కోతలు విధించారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ కింద పలు ప్రాంతాల్లో సరఫరా నిలిపేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గజపతినగరం, తెర్లాం, నెల్లిమర్ల, వేపాడ, ఎస్.కోట, జామి, బాడంగి, చీపురుపల్లి పట్టణాల్లో సాయంత్రం 7నుంచి విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రమైన విజయనగరంలో రాత్రి 11 గంటల నుంచి విద్యుత్ కోతలు విధించారు.
ప్రకాశం జిల్లా కంభం, మార్కాపురం, సింగరాయకొండ, నెల్లూరు జిల్లా గుడ్లూరులలో రాత్రి 9 గంటలకు సరఫరా ఆగిపోయింది. అర్ధరాత్రి 12 గంటల వరకూ కరెంట్ రాలేదు. శ్రీకాకుళం, కడప, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ విద్యుత్తు కోతలు విధించారు. విజయవాడలోని పటమటలో రాత్రి 10.30 గంటల నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అనధికారిక కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరెంటు కోతలకు నిరసనగా నెల్లూరు జిల్లా ఉలవపాడు ప్రజలు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వాహనాల రాకపోకలు నిలిపివేశారు. అర్ధరాత్రి పోలీసులు వచ్చి జాతీయ రహదారిపై వాహనాలు పునరుద్ధరించారు.
ఇదీ చదవండి: TDP Mahanadu : ఒకరోజు ముందే పసుపు పండుగ.. నేడు ఒంగోలుకు చంద్రబాబు ..