విద్యుత్ ఛార్జీల బాదుడుతో ప్రజలు ఇళ్లలో ఉండటం కన్నా క్వారంటైన్ కేంద్రాల్లో ఉండటమే మంచిదని భావిస్తున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఎద్దేవా చేశారు. విజయవాడలోని పార్టీ నగర కార్యాలయంలో సమావేశమైన ఆయన...విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రభుత్వం దోపిడీ చేస్తుందని విమర్శించారు. ఇష్టారీతిగా యూనిట్ విలువను అమాంతం పెంచి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందన్నారు.
ఓ వైపు పని, మరోవైపు తినేందుకు తిండి లేని పరిస్థితుల్లో సాధారణ కుటుంబాలు వేలకు వేలు బిల్లులను ఎలా చెల్లిస్తాయో చెప్పాలని మహేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్ బిల్లుల విషయంలో వైకాపా మంత్రులు పొంతనలేని, అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్నారు. వెంటనే ఏప్రిల్ నెల బిల్లును రద్దు చేసి...మార్చి నెల బిల్లునే చెల్లించేలా ప్రభుత్వం ఆదేశాలివ్వాలన్నారు. పేదవారికి నగదు ఇచ్చినట్లే ఇచ్చి ఓ వైపు మద్యం, మరోవైపు విద్యుత్ బిల్లుల రూపంలో రెండు రెట్లు అదనంగా లాక్కునే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు.