కృష్ణా జిల్లా వ్యాప్తంగా రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రధాన రహదారుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల వరకూ అన్నీ గుంతలమయంగా మారాయి. ప్రధానంగా విజయవాడ నగరంలో రహదారుల దుస్థితి వర్ణనాతీతం. రహదారులకు మరమ్మతులు చేయకపోవటం, కొత్త రహదారులు వేయకపోవటంతో చాలా చోట్ల పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు కేవలం ఎన్నికల వేళ హామీలిచ్చి వెళ్తున్నారే తప్ప.. తమ గోడు పట్టించుకోవటం లేదని నగరవాసులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్ల మేర గుంతలు ఉండడంతో ప్రయాణికులు తీవ్ర అవస్తలు పడుతున్నారని ఆటో డ్రైవర్లు అంటున్నారు. ఈ గుంతలమయమైన రహదారుల వల్ల తమ వాహనాలు ఎక్కువగా ఇంధనం తాగటంమే కాకుండా నెలకోసారి రిపేర్లు వస్తున్నాయని ఆటోవాలాలు వాపోతున్నారు. సింగ్ నగర్,మెుఘల్ రాజపురం,నిర్మలా కాన్వెంట్ రోడ్డు, గాంధీ నగర్ ప్రాంతంలోని రహదారులు నిర్వహణ కొరవడి ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ గుంతల రోడ్ల వల్ల నిత్యం రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని నగరవాసులు అంటున్నారు.
పన్నులు కడుతున్నాం కదా.. రోడ్లెందుకు వేయరు..?
రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో విజయవాడ ఒకటి. కృష్ణా జిల్లా వ్యాప్తంగానేకాక ఇతర ప్రాంతాల నుంచి వ్యాపార, ఇతర అవసరాలతో ఇక్కడికి వచ్చేవారు అధికం. ఇక్కడి నుంచి జిల్లాలోని 16 నియోజకవర్గాలకు ప్రజలు నిత్య ప్రయాణాలు సాగిస్తుంటారు. భారీ వాహనాలు తిరగటం, ఏళ్లతరబడి ఈ మార్గాలన్ని అభివృద్ధికి నోచుకోకపోవటంతో అడుగడుగునా గుంతలుగా మారిన రోడ్లు దర్శనమిస్తుంది. విజయవాడ నుంచి నూజివీడు వెళ్లే రహదారి నున్న దాటిన తర్వాత పూర్తిగా పాడైపోయింది. అడివినెక్కలం, ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో గ్రామస్తులంతా రోడ్ల దుస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దూరం రెండున్నర గంటల సమయం పడుతుందని అంటున్నారు. ప్రభుత్వం వేల కోట్ల ప్రజధనాన్ని పథకాలకు ఖర్చుపెడుతోందని.., రహదారులు బాగు చేయించటం మాత్రం పట్టించుకోవటం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పన్నులు కట్టకపోతే ప్రభుత్వం అదనపు రుసుము విధించి మరీ కట్టించుకుంటుందని, అలాంటప్పుడు సకాలంలో ప్రభుత్వం రహదారులు ఎందుకు వేయటం లేదని ప్రశ్నిస్తున్నారు.
ప్రయాణికుల నరకయాతన!
మైలవరం మండలంలోని గణపవరం గ్రామ ప్రధాన రహదారులు ప్రయాణికులకు నరకయాతన చూపిస్తున్నాయి. 5 సంవత్సరాల క్రితం నూజివీడు- మైలవరం రహదారిని రూ. 25 కోట్లతో నిర్మించారు. అప్పుడే ఆ రోడ్లు నాసిరకంగా మారి పూర్తిగా గుంతలు పడిపోయాయి. ముఖ్యంగా గణపవరం రహదారులపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాహనాన్ని నడపాల్సిన పరిస్థితి ఉందని డ్రైవర్లు చెబుతున్నారు. పనుల కోసం విజయవాడ-మైలవరం మధ్య రాకపోకలు సాగిస్తున్న ప్రజలు...ఇటీవల కురిసిన వర్షాలకు ఏర్పడిన గోతులతో ప్రయాణాలు చేయాలంటేనే వెనక్కి జంకుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో కొత్త మాజేడు నుంచి మోపిదేవి వరకు రహదారి మెుత్తం పెద్దపెద్ద గోతులుగా మారింది. ఈ ప్రాంతం గుండా వెళ్లే 216 జాతీయ రహదారి నిర్మాణంలో ఉన్నప్పటికీ.. పనులు నెమ్మదిగా జరుగుతుండడం, చాలా చోట్ల రహదారి నిర్మాణం కోసం గుంతలు తవ్వివదిలేటం ప్రజలు ప్రాణసంకటంగా ప్రయాణం మారింది. గుడివాడ నుంచి పోలుకుండ, రుద్రపాక, పుట్లచెరువు మీదుగా కైకలూరు నియోజకవర్గంలో జాతీయ రహదారి వరకు సుమారు ...25 కిలోమీటర్లు మేర ప్రయాణం నరకమే. ప్రభుత్వం వెంటనే రహదారులకు మరమ్మతులు చేయటం పూర్తిగా పోయిన చోట కొత్తగా నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. తాము పన్నులు కట్టకపోతే ముక్కు పిండి వసూలు చేస్తున్న ప్రభుత్వం రహదారుల నిర్మాణంలో ఎందుకు అలసత్యం వహిస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: