ఎన్నికల సమయంలో పీఓలతో సమానంగా చాకిరి చేస్తున్నా తమను చిన్న చూపు చూస్తున్నారని.. ఏపీఓ (అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్) లు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులకు కలిపి 1250 రూపాయలు భత్యం చెల్లిస్తామని చెప్పి.. రోజంతా కష్టపడినా సరైన వసతి ఏర్పాట్లు చేయలేదన్నారు.
ఓపీలకు ఒక తీరుగా.. తమకు మరో తీరుగా భోజనాలు ఏర్పాటు చేయడం తీవ్ర మానసిక క్షోభకు గురి చేసిందని మీడియా ముందు తమ గోడు వెలిబుచ్చారు. ఉదయం 6 గంటలకు ఎన్నికల విధుల్లో పాలు పంచుకొని కష్టపడిన తమకు తగిన సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందారన్నారు.
అధికారులు సాయంత్రం 3:30 గంటలకు విధులు ముగిసినా.. రాత్రి 9 గంటల వరకు ఇవ్వవలసిన భత్యాన్ని అందజేయక పోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. కనీసం 1000 రూపాయలు కూడా ఇవ్వకుండా ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసలతో వచ్చిన తమకు నాలుగు సంతకాలు పెట్టించుకొని 500 రూపాయలు ఇవ్వడంతో ఎదురుతిరిగారు. మహిళలని కూడా చూడకుండా అధికారులు నిర్లక్ష్య వైఖరితో భోజన ఏర్పాట్లు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. సంబంధిత అధికారులను ఈ విషయంపై నిలదీయడంతో.. పై అధికారుల ఆదేశాల మేరకు రూ.500 ఇస్తున్నామని తెలిపి అప్పటికప్పుడు భోజనాలు తెప్పించారని అన్నారు.
ఇదీ చదవండి: