Farmers Meeting In Tirupati: ఈ నెల 17న అమరావతి రైతులు తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయిస్తామని రైతులు ప్రకటించారు. అనుమతి కోసం ముందస్తు దరఖాస్తు చేసుకున్నా.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని రైతులు మండిపడ్డారు. శని, ఆదివారాల్లో కోర్టు సెలవు చూసుకుని నిర్ణయం ప్రకటించారని వారు ఆరోపించారు. ఇందుకుగాను తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెప్పారు.
దర్శనానికి అనుమతివ్వండి..
ఈనెల 15, 16 తేదీల్లో శ్రీవారి దర్శనం కోసం తితిదేను కోరినట్లు రైతులు తెలిపారు. ఆలయ నిబంధనల మేరకే నడుచుకుంటామని స్పష్టం చేశారు. కొండపై రాజకీయ విమర్శలు, జెండాలు, నినాదాలు చేయమని పేర్కొన్నారు. పాదయాత్ర చేసినవారికి దర్శన భాగ్యం కల్పించాలని కోరారు.
41వరోజూ పాదయాత్ర..
41వ రోజు పాదయాత్ర శ్రీకాళహస్తి నుంచి ప్రారంభించారు. రాయలసీమ ప్రజల నుంచి లభిస్తున్న అపూర్వ మద్దతుతో దాదాపు 17 కిలోమీటర్ల నడక సాగించనున్నారు. శ్రీకాళహస్తి నుంచి మిట్టకండ్రిగ, చెర్లోపల్లే, ఇసుకగుంట, రాచగన్నెరు మేర్లపాక, ఏర్పేడు, సీతారాంపేట మీదుగా అంజిమేడు వరకు యాత్ర కొనసాగనుంది.
ఇదీ చూడండి:
AMARAVATI FARMERS PADAYATRA: 'రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి.. అది అమరావతే'