పోలీసులకు సవాల్‌గా మారిన విజయవాడలో ఏటీఎం వరుస చోరీలపై దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఈ చోరీలకు పాల్పడిన వారు హర్యాణా ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో సీసీ కెమెరాల దృశ్యాలు, బ్యాంక్ ఖాతాల ఆధారంగా పోలీసులు నిందితుల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. చోరీ జరిగిన తీరు.. ఆధారంగా నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లుగా పోలీసులు భావిస్తున్నారు.
గతంలో ఇదే తరహాలో కొంతమంది విశాఖలో, ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ తరహా చోరీలను చేసినట్లు పోలీసులు గుర్తించారు. హర్యాణాలోని మేవత్ ప్రాంతానికి చెందిన ముఠా ఈ తరహా నేరాలకు పాల్పడుతోందని పోలీసులు నిర్ధరించారు. విశాఖలో పలు ఏటీఎంల్లో లక్ష రూపాయలు మేర దోచేసినట్లు గుర్తించారు. ఆ కేసులో ఇద్దరు నేరస్థులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులు సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. సెక్యూరిటీ లేని ఏటీఎంలను ఎంచుకుని తమ ఖాతాలోని నగదును డ్రా చేస్తారు. నగదు బయటకు వచ్చేటప్పుడు ఏటీఎంకు అందే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. దీంతో లావాదేవీలు జరిగినట్లు బ్యాంక్ రికార్డ్స్ లో కనపడదు. నగదు ఏటీఎం నుంచి వచ్చినా .. ఖాతాలో నగదు కట్ అవ్వదు. ఒకవేళ కట్ అయితే నిందితులు బ్యాంక్ కు ఫోన్ చేసి తమకు నగదు రాలేదని ఫిర్యాదు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.
బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎంతమంది ఈ తరహా నేరాలకు పాల్పడ్డారనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. నిందితులు ఇప్పటివరకు 41 లక్షల రూపాయల మేర నగదు కాజేసినట్లు బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు.
రెండు నెలల నుంచి ఈ తరహాలో లావాదేవీలు నిర్వహిస్తున్నా బ్యాంక్ అధికారులు గుర్తించలేదు. నిందితులు రాష్ట్రానికి వచ్చేటప్పుడు స్నేహితుల ఏటీఎం కార్డులు సైతం తీసుకువస్తారని పోలీసులు చెబుతున్నారు . దిల్లీ కేంద్రంగా ఉంటూ ఈ ముఠా దొంగతనాలు చేస్తుంటుందని పోలీసులు గుర్తించారు. నేరం చేయాల్సిన నగరాలకు విమానంలో వస్తారు. లాడ్జి,హోటళ్లలో మకాం పెడతారు. నేరం చేసే ప్రాంతాల్లో ముందుగా రెక్కీ నిర్వహిస్తారు. పక్కా పథకం ప్రకారం ఏటీఎంల్లో నగదు కొల్లగొడతారని పోలీసులు గుర్తించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఏటీఎంలో కరెంటు తీస్తున్నారు... సొమ్ము కొట్టేస్తున్నారు!