పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రానికి పంపకుండా మీ దగ్గరే ఉంచుకుంటే ఎలా అని ఆంధ్రప్రదేశ్ అధికారులు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులను నిలదీశారు. అడిగిన సమాచారం ఇస్తేనే కదా మేం పంపేది అని అథారిటీ అధికారులు అదే స్థాయిలో సమాధానమిచ్చారు. ఈ వాదోపవాదాలతో బుధవారం హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం వాడీ వేడిగా సాగింది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు పెట్టుబడి అనుమతి అంశంపై ఆంధ్రప్రదేశ్, పీపీఏ అధికారుల మధ్య పరస్పరం వాదనలు సాగాయి. వాస్తవానికి ఈ అంశం ఎజెండాలో లేకున్నా ఏపీ అధికారులు నిలదీయడంతో అథారిటీ అధికారులు సమాధానమిచ్చారు. వాదోపవాదాల అనంతరం.. నెల రోజుల సమయం తీసుకొని సమాచారం పంపాలని అథారిటీ అధికారులు సూచించారు. పది రోజుల్లోనే ఇస్తామని ఆంధ్రప్రదేశ్ అధికారులు సమాధానమిచ్చినట్లు తెలిసింది.
అథారిటీ ముఖ్య అధికారి చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, పోలవరం చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌బాబు, పీపీఏ కార్యదర్శి శ్రీనివాస్, కేంద్ర జల్‌శక్తి శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.
ఎంతిస్తారో తెలియకుండా పనులు ఎలా చేసేది?
విశ్వసనీయ సమాచారం ప్రకారం పెట్టుబడి అనుమతిపైనే ప్రధానంగా చర్చ జరిగింది. సవరించిన అంచనాను ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతుండగా, అథారిటీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీంతో ఇప్పటివరకు ఫైలు కేంద్రానికి వెళ్లలేదు. పెట్టుబడి అనుమతి కేంద్ర జల్‌శక్తి శాఖకు సంబంధించిన అంశమని పీపీఏ అధికారులు పేర్కొనగా, ముందు ఇక్కడి నుంచి వెళ్లాలి కదా అని ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అభ్యంతరాలకు సమాధానం ఇస్తే పరిశీలించి దిల్లీకి పంపుతామని అథారిటీ అధికారులు పేర్కొన్నారు. పది రోజుల్లో పంపుతామని, ప్రాజెక్టుకు కేంద్రం ఎంత ఇస్తుందో తెలియకుండా పనులు ఏం చేస్తామని ఆంధ్రప్రదేశ్ అధికారులు సమాధానమిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాగునీటి వ్యయాన్ని అంచనాలో చేర్చే అంశంపై చర్చ జరిగింది. దీన్ని తాము కేంద్రానికి పంపుతామని, అక్కడ అధికారులతో మాట్లాడాలని అథారిటీ అధికారులు సూచించినట్లు తెలిసింది. బిల్లుల చెల్లింపులో కాంపొనెంట్ల వారీగా ఉన్న పరిమితుల గురించి ఆంధ్రప్రదేశ్ అడగ్గా, ఈ అంశం తమ చేతుల్లో లేదని పీపీఏ అధికారులు సమాధానమిచ్చారు. పునరావాసం విషయంలో పురోగతి లేకపోవడం, పనుల్లో జాప్యం గురించి సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి మార్చడంపై చర్చ జరిగినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
ఇదీ చదవండి: