ప్రాజెక్టు నిర్మాణానికి పాత, కొత్త ధరలతో రూపొందించిన అంచనాలన్నింటినీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ పరిగణనలోకి తీసుకుంది. ప్రాజెక్టులో తాగునీటి సరఫరా వ్యయాన్ని సాగునీటి వ్యయంలో భాగంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ జల వనరులశాఖ కోరుతోందని, దీనిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పాత, కొత్త ధరలను ఆమోదిస్తూ అథారిటీ చేసిన ఈ సిఫార్సులు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ, ఆపై కేంద్ర ఆర్థికశాఖ ఎంతవరకు ఆమోదిస్తాయన్న దానిమీదే ప్రాజెక్టుకు వచ్చే నిధులు ఆధారపడి ఉంటాయి.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చే నిధులపై కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. ప్రాజెక్టులో 2013-14 ధరలతో విద్యుత్తువిభాగం కింద అయ్యే వ్యయాన్ని, తాగునీటి విభాగానికి అయ్యే వ్యయాన్ని మినహాయించి కేవలం సాగునీటి వ్యయం కింద రూ.20,398.61 కోట్లకే అంచనాలకు ఆమోదించి పంపాలంటూ కేంద్ర ఆర్థికశాఖ జలశక్తిశాఖకు లేఖ రాసింది. అదే అంశాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదించి పంపాలంటూ కేంద్ర జలశక్తిశాఖ ఆ లేఖను అథారిటీకి పంపింది.
దీనిపై చర్చించేందుకు పోలవరం అథారిటీ సర్వసభ్య సమావేశం నవంబరు 2న హైదరాబాద్‌లో జరిగింది. ఏపీ జల వనరులశాఖ తరఫున సమావేశంలో పాల్గొన్న అధికారులు తాజా అంచనాల ప్రకారం కొత్త ధరలు ఎందుకు ఇవ్వాలో వివరించారు. ప్రాజెక్టు వ్యయమంతా కేంద్రమే భరిస్తానని చెప్పిన విషయాన్నీ పేర్కొన్నారు. అలా చెప్పినా.. అథారిటీ సమావేశం మినిట్స్ ఎలా ఖరారు చేస్తారో అన్న సందేహం ఉంది. ప్రతిపాదిత మినిట్స్‌లో మెలిక ఉండటంతో ఏపీ జల వనరులశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో తుది మినిట్స్ ఖరారు చేశారు. దీంతో సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇక తాజా ధరలపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పోలవరం అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీపీఏ కార్యదర్శి రంగారెడ్డి, జల వనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి, ఆర్‌సీసీ ఛైర్మన్ జగ్‌మోహన్ గుప్తా, కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజినీర్లు, తెలంగాణ అధికారులు పాల్గొన్నారు.
రివైజ్డు కాస్ట్ కమిటీ (ఆర్‌సీసీ) లెక్క కట్టిన అంచనా వ్యయం ఇలా (అంకెలన్నీ రూ.కోట్లలో)
తుది నిర్ణయాలు ఇలా..
* 2013-14 ధరలతో అంచనాల సవరణ కమిటీ (ఆర్‌సీసీ) 2020 మార్చి 17న రూ.29,075 కోట్ల అంచనా వ్యయానికి సిఫార్సు చేసింది. దీన్ని పోలవరం అథారిటీ ఆమోదించింది. ఇందులో రూ.4,560.91 కోట్లు విద్యుత్కేంద్రం అంచనా వ్యయంగా, రూ.4,068.43 కోట్లు తాగునీటి సరఫరా వ్యయంగా ఉంది.
* కేంద్ర ఆర్థికశాఖ 2020 అక్టోబరు 12న పంపిన లేఖ ప్రకారం 2013-14 ధరలతో సాగునీటి విభాగానికి రూ.20,398.61 కోట్ల ఖర్చు అవుతుందని ఆర్‌సీసీ తేల్చింది. దీనికి ఆమోదం తెలియజేసి పంపాలని కేంద్ర ఆర్థికశాఖ కోరింది. వీటిని అథారిటీ ఆమోదించింది.
* 2017-18 ధరలతో ఆర్‌సీసీ సిఫార్సు చేసిన రూ.47,725.74 కోట్ల అంచనా వ్యయాన్ని పోలవరం అథారిటీ పరిగణనలోకి తీసుకుని ఆమోదించింది.
* పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 2017-18 ధరలతో తాజా అంచనాలు రూ.47,725.74 కోట్ల కేటాయింపుపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అథారిటీ సిఫార్సు చేసింది.
ఇదీ చదవండి: