ప్రకాశం బ్యారేజీకి దిగువన కొత్తగా రెండు బ్యారేజీలు నిర్మించాలంటే ప్రాథమిక అంచనాల ప్రకారమే రూ.2,500 కోట్లకు మించి ఖర్చవుతుందని గతంలో అంచనా వేశారు. ఇందుకు సంబంధించిన నిధుల సమీకరణే అన్నింటికన్నా ముఖ్యమైన అంశంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో గుత్తేదారులకు పాత బిల్లుల చెల్లింపులూ సమస్యగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టే కొత్త సాగునీటి ప్రాజెక్టులన్నింటికీ వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవాలనే ఆలోచనతోనే ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
కృష్ణా ఉప్పునీటి నివారణ పథకం పేరుతో ప్రత్యేక వాహక సంస్థ(ఎస్‌పీవీ)ను ఏర్పాటు చేసి ఈ రెండు కొత్త బ్యారేజీల నిర్మించడంతో పాటు ఉప్పుటేరుకు సంబంధించిన పనులు చేయాలనేది యోచన. రుణ సమీకరణ ప్రయత్నాలు సాగుతున్నా ఫలితాల్లో ఆలస్యమవుతోంది. కృష్ణా నదిలో పులిచింతల దిగువన పరీవాహక ప్రాంతం నుంచి వృథాగా పోతున్న కృష్ణా జలాలను నిల్వ చేసి వినియోగించుకునే ఉద్దేశంతో కొత్త బ్యారేజీల నిర్మాణం తెరపైకి వచ్చింది. దాదాపు ఆరు సంవత్సరాలుగా ఈ ప్రతిపాదనపై కసరత్తు సాగుతున్నా ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఎగువ కృష్ణా జలాలు పులిచింతలకు చేరకముందే ప్రకాశం బ్యారేజీని దాటి సముద్రంలో కలిసిపోయిన సందర్భాలూ ఉన్నాయి. గత రెండు సంవత్సరాల్లోనే ప్రతి ఏటా 700 టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలో కలిసి పోయాయి. దీంతో రెండు బ్యారేజీలు 6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- ప్రకాశం బ్యారేజీకి దిగువన 12 కిలోమీటర్ల వద్ద చోడవరం ప్రాంతంలో ఒక బ్యారేజీ నిర్మించాలన్నది ప్రతిపాదన. కృష్ణా ఎడమ గట్టుపై చోడవరం కుడి గట్టున మంగళగిరి మండలం రామచంద్రాపురం వద్ద కలిసేలా ఈనిర్మాణం చేపట్టవలసి ఉంది. మూడు టీఎంసీల నిల్వకు అవకాశం. రూ.1,215 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
- ప్రకాశం బ్యారేజీ దిగువన 62 కిలోమీటర్ల దూరంలో బండికోళ్లలంక వద్ద మరో బ్యారేజీ నిర్మాణం చేపడతారు. దీనికి రూ.1,350 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
సర్వే పనులు ప్రయివేటు ఏజెన్సీకి...
పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక రూపొందించేందుకు ప్రైవేటు ఏజెన్సీకి సర్వే పనులు అప్పగించారు. వారికి ఆరు నెలల గడువు ఉన్నా మరో నెలలో సర్వే పూర్తి చేస్తారని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జియో టెక్నికల్ సర్వే జరుగుతోంది. నెల రోజుల్లో వారి నివేదిక అందిన తర్వాత రెండో దశ అనుమతుల కోసం ప్రభుత్వానికి పంపవలసి ఉంటుంది.
ఇదీ చదవండి: 48వ సీజేఐగా నేడు జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణస్వీకారం