జగన్ కేబినెట్లో మంత్రి పదవులు దక్కని అసంతృప్తుల బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఎమ్మెల్యేల అసంతృప్తి వ్యవహారం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరింది. మంత్రి పదవులు రాని అసంతృప్త నేతలతో సీఎం జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లికి వచ్చిన వైకాపా ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సామినేని ఉదయభాను, పార్థసారథిలతో వేర్వేరుగా భేటీ అయ్యారు.
మంత్రి పదవి ఇవ్వలేకపోయేందుకు గల కారణాలను ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వివరించారు. భవిష్యత్తులో మంత్రి పదవుల భర్తీలో ప్రాధాన్యత ఇస్తామని వారిని బుజ్జగించారు. మరోవైపు మంత్రివర్గంలో కొనసాగించకపోవటంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ హోమంత్రి సుచరితకు సీఎం జగన్ అపాయింట్మెంట్ దక్కలేదు. సుచరిత రాజీనామా ఆంశంపై ఆ ప్రాంత వైకాపా బాధ్యుడు ఎంపీ మోపిదేవి వెంకటరమణ సీఎం జగన్‌తో చర్చించారు.
శాంతించిన బాలినేని: మంత్రివర్గంలో స్థానం దక్కనందుకు అసంతృప్తితో రగిలిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు శాంతించారు. ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకు తన ఆగ్రహాన్ని మౌనంగానే వ్యక్తపరిచిన బాలినేని.. చిట్ట చివరకు దిగివచ్చారు. ముఖ్యమంత్రి ఏం మంత్రం వేశారో గానీ.. ఆయనతో నిన్న భేటీ అయిన అనంతరం పూర్తిగా కూల్ అయిపోయారు. తాను వైఎస్ కుటుంబానికి విధేయుడిని అని ప్రకటించుకున్న మాజీ మంత్రి.. జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు.
అన్నా రాంబాబు అనుచరుల నిరసన.. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అనుచరులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్నా రాంబాబుకు మంత్రి పదవి రాలేదనంటూ కంభంలో ఆయన అనుచరుల రాస్తారోకో చేశారు. అలాగే కంభంలో ఆర్యవైశ్యులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన చేపట్టారు.
తప్పనిసరిగా వస్తుందని ఆశించా..ఎన్టీఆర్ జిల్లా నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఉన్నా కాబట్టి మంత్రివర్గ విస్తరణలో తప్పనిసరిగా పదవి దక్కుతుందని ఆశించానని సామినేని ఉదయభాను వివరించారు. ‘నాకు పదవి రాకపోవడంతో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన మా నాయకులు బాధపడ్డారు. వాళ్లు నిరసన కార్యక్రమాలు చేస్తుంటే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయరాదని ఆపా. పదవి రానందున బాధపడ్డాం. 2024లో పార్టీని మళ్లీ అధికారంలోకి తేవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి విజయవాడ, కృష్ణా జిల్లాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సీఎం చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఈ విడతలో మంత్రిపదవి ఇచ్చే పరిస్థితి లేదు కనుక సర్దుకుంటాం. 2024లో ప్రభుత్వం వచ్చాక ఆలోచించాలి’ అని పేర్కొన్నారు.
పవన్‌ది షేరింగ్ పార్టీ..వైకాపా నేతలను సీబీఐ దత్తపుత్రులు అనాల్సి వస్తుందన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఉదయభాను స్పందిస్తూ.. ‘పవన్‌కు దమ్ముంటే ఆయన పార్టీని బలోపేతం చేసుకోవాలి. చంద్రబాబు పంచన చేరి.. 20, 30 సీట్లు ఇస్తే ఎన్నికలకు రావాలని చూస్తున్నారు తప్ప.. పవన్ ఎప్పుడూ ప్రజా నాయకుడు కాలేరు. ఆయనది ఎప్పుడూ షేరింగ్ పార్టీ. తెదేపాతో కలవాలి.. వారు డబ్బిస్తే కొన్ని సీట్లలో పోటీ చేయాలనే వ్యక్తి.. పార్ట్ టైం రాజకీయ నాయకుడు ఆయన.. షూటింగ్‌లు లేనపుడు వచ్చి పోతుంటారు, అలాంటి వ్యక్తిని ప్రజలు గుర్తించరు’ అని అన్నారు.
అలక వీడని సుచరిత: మంత్రి పదవి దక్కక అలకబూనిన గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను పార్టీ పెద్దలు కలవకపోవటం ఆమె అభిమానులు, నియోజకవర్గ పార్టీ నాయకుల్లో చర్చనీయాంశమైంది. ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ కార్యకర్తలు రెండు రోజుల నుంచి గుంటూరులో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. ఆమెకు లేని పదవులు తమకు అవసరం లేదని తెలిపారు. ఆదివారం రాత్రి ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు ఆమె నివాసానికి వచ్చి ‘సామాజిక సమీకరణాల వల్ల చోటు కల్పించలేకపోయామని, మీకు న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుందని’ చెప్పి వెళ్లారు. అది మినహా తిరిగి ఇప్పటి వరకు అధిష్ఠానం నుంచి వచ్చి మాట్లాడిన పెద్దలు లేరని ఆమె వర్గీయులు అంటున్నారు. సోమవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ఆమె ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నానని, పార్టీలో కొనసాగుతానని చెప్పారు. ఇంత జరిగినా పార్టీ వైపు నుంచి ఎలాంటి పలకరింపు లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి రమ్మన్నారని, అయితే అనారోగ్యం కారణంగా కలవటానికి వెళ్లలేదని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: అసంతృప్తి ఎమ్మెల్యేలకు బుజ్జగింపులు... మధ్యాహ్నం సీఎంను కలవనున్న ఉదయభాను