రాష్ట్ర ప్రభుత్వం సాగు భూమి యజమానులతోపాటు కౌలు రైతులకూ ప్రయోజనాలు వర్తింపజేస్తున్నా.. కొన్ని చోట్ల అనుమానాలతో భూ యజమానులు కౌలు రైతులకు తగిన ధ్రువపత్రాలు ఇవ్వడం లేదని మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కన్నబాబు చెప్పారు. ఫలితంగా వారికి ప్రయోజనాలు దక్కడం లేదన్నారు. వీటన్నింటిని పరిష్కరించేందుకు రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంకర్ల తో సమావేశం కావాలన్న సీఎం ఆదేశాలతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. భూ యజమానికి తన భూమిపై హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేలా నూతన కౌలుదారుల చట్టాన్ని తీసుకువచ్చామని... భూ యజమానులతో పాటు కౌలు రైతులకూ రైతు భరోసా వర్తింపజేస్తున్నట్లు తెలిపారు.
భూ యజమానులు దృక్ఫథాన్ని మార్చుకుని తమ కౌలురైతుల వివరాలు బహిరంగ పరచాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరారు. ఈ ఏడాది 8500 కోట్ల రుణాలను కౌలు రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ అన్యాయం చేయవద్దని.. కౌలు రైతులందరికీ రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించినట్లు తెలిపారు. చేపట్టనున్న సదస్సుల్లో ప్రతి కౌలు రైతుకూ సీసీఆర్సీ ధ్రువపత్రం ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. భూ యజమానులు, కౌలు రైతులు, పాడిరైతులు, మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు పెద్ద ఎత్తున ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: