దేశంలో తొలిసారి కిరాయి రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని మంత్రి పేర్ని నాని విమర్శించారు. రాజకీయ పార్టీలకు టెంట్ హౌస్ పెట్టిన వ్యక్తి పవన్ అని ఎద్దేవా చేశారు. చిత్ర నిర్మాతలు దిల్ రాజు, బన్నివాసు, డీవివి దానయ్య తదితరులు మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు.
ఇండస్ట్రీకి నష్టం జరిగే సంఘటనలు ఉత్పన్నమవుతున్నందునే నిర్మాతలు తనతో సమావేశం కావాలని కోరారని తెలిపారు. ఇండస్ట్రీ అంతా ఒక్కమాటపై ఉన్నామని.. ఇదే మాట సీఎంకు చెప్పాలని నిర్మాతలు కోరారన్నారు. ఆన్లైన్ టికెట్ల అమ్మకానికి అనుకూలమని నిర్మాతలు చెప్పారు. ఇప్పటికే పలు పోర్టల్స్ నుంచి ఆన్లైన్లో టికెట్ల అమ్ముతున్నారన్నారు. ప్రభుత్వం నిర్వహించిన గత మీటింగ్‌పై అందరూ సంతృప్తి గా ఉన్నారని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలకు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదని నిర్మాతలు చెప్పారని తెలిపారు. పవన్ వ్యాఖ్యలకు తామంతా బాధపడినట్లు నిర్మాతలు తెలిపారన్నారు. పవన్ వ్యాఖ్యలపై భేటీలో విచారం వ్యక్తం చేశారన్నారు.
పవన్ వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి సంబంధం లేదు..
ఆడియో ఫంక్షన్లో జరిగిన పరిణామాలతో ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరంజీవి కూడా తనతో చెప్పారని మంత్రి వివరించారు. ఇండస్ట్రీని బ్రతికించేందుకు ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలు పాటించేందుకు సిద్ధమని చెప్పారని తెలిపారు.
తాను బూతులు తిట్టలేదు కాబట్టే టీవీలో తన ప్రెస్ మీట్ ప్రసారం చేశారని.. తనను అవమానించాలని చూస్తే.. ఆ అవమానాన్ని ఆయనకు పరిచయం చేస్తానని మంత్రి తెలిపారు.
ఏపీ ప్రభుత్వం సానుకూలం..
పరిశ్రమపై కొవిడ్ ప్రభావం.. సమస్యలను గతంలో చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో కలిసి సీఎంను కలిసినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లామని నిర్మాత దిల్ రాజు చెప్పారు. దయచేసి అందరూ మమ్మల్ని వివాదాలకు దూరంగా ఉంచాలని కోరారు. గతంలో తమ విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. ఆన్లైన్ విధానం కావాలని పరిశ్రమ తరపున.. తామే ప్రభుత్వాన్ని కోరామని పేర్కొన్నారు. ఆన్లైన్ విధానం ద్వారా పారదర్శకత ఉంటుందని చెప్పారు.
ఇదీ చదవండి: PAWAN KALYAN: భయమంటే ఎలా ఉంటుందో.. నేను నేర్పిస్తా: పవన్ కల్యాణ్