కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ విపత్కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యులు సేవలందించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి వైద్యునికీ తన తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నానన్నారు. కొవిడ్ సమయంలోనే కాకుండా..ఎల్లప్పుడూ అంకిత భావంతో వృత్తి ధర్మాన్ని పాటించే వైద్యులు ఎందరో ఉన్నారన్నారు.
భారతీయ సమాజం వైద్యులను భగవంతుడితో పోలుస్తోందని..పేదలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ వైద్య నారాయణులు అనే భావనను మరింత ఇనుమడింపజేస్తారని కోరుకొంటున్నానని ఆకాక్షించారు. గ్రామీణ, అటవీ ప్రాంతాలకు వైద్య సేవలు చేరేలా కృషి చేయాల్సిన బాధ్యత యువ వైద్యులపై ఉందని పవన్ అన్నారు. వైద్యుల సేవలు వెలకట్టలేనివని..,వారిని గౌరవిస్తూ దాడులు జరగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలన్నారు.
వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత జీవితాలకంటే రోగులకు స్వస్థత కలిగించడమే ముఖ్యంగా భావిస్తారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సమాజంలో వైద్యులకు ఎంతో విలువైన స్థానాన్ని ఇచ్చారన్నారు. వైద్యసేవలో ఉన్నవారిపై అజమాయిషీ చేసే అధికారాన్ని ఇతర విభాగాలకు కట్టబెడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీచదవండి