వైకాపా ప్రభుత్వ అనాలోచిత విధానాలే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. పల్లెల్లో 11 నుంచి 14 గంటలు, పట్టణాల్లో 5 నుంచి 8 గంటలు, నగరాల్లో 4 నుంచి 6 గంటలు చొప్పున విద్యుత్ కోతలతో జనం అల్లాడిపోతున్నారని పవన్ ఆవేదన చెందారు. సెల్ఫోన్ల వెలుగులో ఆస్పత్రుల్లో ఆపరేషన్లు, ప్రసవాలు జరగడం చూస్తుంటే... కరెంట్ కోతల తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. పరీక్షలకు సన్నద్దమవుతున్న విద్యార్థులు... విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. ఇళ్లలో కరెంట్ లేక కొందరు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిశ్రమలకు 'పవర్ హాలిడే' ప్రకటించడంపైనా పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజన సమయంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 2014– 19 మధ్య కూడా కోతల ప్రభావం లేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఒప్పందాలు రద్దుచేసి, గతానికంటే ఎక్కువ ధరలకు విద్యుత్ కొనడం ఏంటని ప్రశ్నించారు. 'పవర్ హాలిడే' అనేది పారిశ్రామిక అభివృద్ధికి విఘాతమన్నారు. దీని వల్ల 36లక్షల మంది కార్మికుల ఉపాధికి గండి పడుతుందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యక్తిగత అజెండాతో జనసేన పార్టీని స్థాపించలేదని.. ప్రజలు బాగుండాలి, వారిని పల్లకీ ఎక్కించాలనే ఉద్దేశంతోనే పార్టీని ప్రారంభించానని పవన్ అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల నుంచి.. పెరిగిన విద్యుత్ ఛార్జీల వరకు ప్రజల పక్షానే పోరాటం చేస్తున్నామని ఆయన స్పష్టంచేశారు. ఉద్యోగులు రోడ్డెక్కడానికి, కౌలు రైతుల ఆత్మహత్యలకు కారణం ప్రభుత్వ విధానాలేనని మండిపడ్డారు.
అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్న వైకాపా.. ఇప్పుడు 57 శాతం ఛార్జీల మోత మోగించడం దారుణమన్నారు. ప్రభుత్వ విధానాలపై మాట్లాడితే తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారన్న పవన్.. నోటికి వచ్చినట్లు మాట్లాడి తన సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. పవర్ అగ్రిమెంట్ల రద్దు నుంచి పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించే వరకు జగన్ సర్కార్ ఎలా మోసం చేస్తుందో.. ప్రజల్లోకి తీసుకెళ్లాలని జన సైనికులు, వీరమహిళలకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: నాపై చంద్రబాబు బురద : జగన్