దేశప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాక్షలు తెలిపారు. వజ్రోత్సవ స్వాతంత్య్ర వేడుక భారతావనికి ఓ మధురమైన ఘట్టమని, భారత మాతకు స్వేచ్ఛా స్వాతంత్రాలు సిద్ధించినందుకు చారిత్రాత్మక గుర్తుగా జరుపుకొంటున్న 75వ వేడుక ఈ అమృతోత్సవ గీతిక అని అన్నారు. శతాబ్దాల పోరాట ఫలితం ఈ స్వాతంత్య్ర ఫలంగా అభివర్ణించారు. ఈ మహోత్కృష్టమైన రోజున మన దేశ స్వతంత్ర సంగ్రామంలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ వారికి నీరాజనాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ వజ్రోత్సవ శుభవేళ తన పక్షాన, జనసేన పక్షాన భారతీయులందరికీ.. పవన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
"ఎన్నో అవాంతరాలను, మరెన్నో విలయాలను అధిగమిస్తూ మన దేశం విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఎందరో మేధావులు, రాజనీతిజ్ఞులు, కవులు, కళాకారులు, కోట్లాది మంది కార్మిక కర్షకులను ఈ ప్రపంచానికి భరతమాత అందిస్తూనే ఉంది. ప్రాచీన విజ్ఞానం, వేద వేదాంగాలను ఈ విశ్వ యవనికపై వెదజల్లుతూనే ఉంది. ప్రపంచంలో ఒక మహత్తరమైన శక్తిగా ఆవిర్భవించడానికి కృషి చేస్తోంది. వసుధైక కుటుంబానికి బాటలు వేస్తోంది. ఇంతటి తేజోమూర్తి అయిన భరతమాతకు ప్రణమిల్లుతోంది. శతవార్షిక స్వాతంత్ర దినోత్సవం నాటికి నిరక్షరాస్యత, పేదరికం, సాంఘిక అసమానతలు లేని దేశంగా భారత్ ఆవిష్కృతమవ్వాలని కోరుకుంటున్నా" - పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అధినేత
విజయవాడ చేరుకున్న జనసేనాని..
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి విజయవాడకు వచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
ఇదీ చదవండి:
corona cases : రాష్ట్రంలో కొత్తగా 1,535 కరోనా కేసులు.. 16 మంది మృతి