భారతదేశం నుంచి విదేశాలకు రాకపోకలు సాగించే వారి సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తోంది. పర్యాటకం, వ్యాపారం, ఉద్యోగాలు, విద్య ఇలా రకరకాల అవసరాల నిమిత్తం దేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలను చుట్టి వచ్చే వారు ఘననీయంగా పెరుగుతున్నారు. దీనితో పాస్‌పోర్టుల అవసరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దేశంలోని 36 ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాల పరిధిలోని 93 సేవా కేంద్రాలు, 424 తపాలా శాఖల ద్వారా పాస్‌పోర్టుల జారీ జరుగుతోంది.
కొత్త సంస్కరణలు
గత ఏడాది 1.30 కోట్లకు పైగా దరఖాస్తు చేసుకోగా.... 1.22 కోట్లకు పైగా పాస్‌పోర్టులు పొందారు. పౌరుల జీవన విధానంలో వస్తున్న మార్పులు...అవసరాలను పెంచడంతో పాటు ఆధునికత వైపు పరుగులు తీయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాస్‌పోర్టుల జారీలో కూడా సంస్కరణలు తీసుకొచ్చే దిశలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ముందుకు వెళ్తోంది. పాస్‌పోర్టుల జారీ ప్రక్రియలో మార్పులు చేర్పులతో కొత్త తరహా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
వెరిఫికేషన్ ఇలా...
ప్రధానంగా పాస్‌పోర్టు జారీ చేసే ముందు... దరఖాస్తుదారుడు తన దరఖాస్తులో పొందుపరిచిన విషయాలపైనే పోలీసులు వెరిఫికేషన్ చేస్తారు. దరఖాస్తుదారుడుపై కేసులు ఏమైనా ఉన్నాయా...? ఉంటే అవి ఏలాంటివి...? పాస్‌పోర్టు జారీకి ఆటంకం కలిగించేవా? లేక పెట్టీ కేసులా...? వాటిని దరఖాస్తులో పొందుపరిచారా? లేదా? అని పరిశీలిస్తారు. పాస్‌పోర్టు నియమనిబంధనలకు లోబడి ఉన్నట్లయితే పాస్‌పోర్టు జారీకి ఏలాంటి అభ్యంతరం లేదని పేర్కొంటూ దరఖాస్తుదారుడికి చెంది పోలీసు శాఖ నుంచి పాస్‌పోర్టు కార్యాలయానికి నివేదిక వెళ్తుంది. పోలీసు శాఖ ఇచ్చే నివేదికపై ఆధారపడి... పాస్‌పోర్టు జారీ తదుపరి ప్రక్రియ కొనసాగుతుంది. అంటే పాస్‌పోర్టు జారీలో పోలీసు వెరిఫికేషన్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.
గతంలో కొత్తగా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి చెంది మాత్రమే వెరిఫికేషన్ చేసేవారు. ఇప్పుడు నిబంధనలు కఠినతరం అయ్యాయి. ఇద్దరు తల్లిదండ్రులు పాస్‌పోర్టులు కలిగి ఉన్నట్లయితే మైనర్లకు పోలీసు వెరిఫికేషన్ ఉండేది కాదు. కానీ మారిన నిబంధనల ప్రకారం ప్రతి పాస్‌పోర్టు జారీకి పోలీసు వెరిఫికేషన్ తప్పని సరి చేశారు.
పుట్టిన తేదీకి చెంది ప్రధానంగా స్థానిక సంస్థలు జారీ చేసిన జన్మదిన ధ్రువీకరణ పత్రం.. పదోతరగతి మార్కుల జాబితా.. వంటివి ఇప్పటి వరకు పరిగణనలోకి తీసుకునే వారు. తాజాగా ఆధార్‌కార్డు, ఎన్నికల గుర్తింపుకార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా మొత్తం 11 రకాల ధ్రువీకరణ పత్రాలను జాబితాలో చేర్చారు. వీటిలో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుందని పాస్‌పోర్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మారిన నిబంధనలు
అదే విధంగా చిరునామాకు బ్యాంకు పాస్‌పుస్తకం, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపుకార్డు తదితర వాటిని పరిగణనలోకి తీసుకునే వారు. తాజాగా వాటికి అదనంగా వాటర్‌బిల్లు, టెలిఫోన్ బిల్లు, విద్యుత్తు బిల్లు, ఉద్యోగి గుర్తింపు కార్డు ఇలా 22 రకాల పత్రాలను జాబితాలో చేర్చారు. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం... ప్రస్తుత చిరునామాతో పాటు అంతకు ముందు ఏడాది కాలం ఎక్కెడక్కడ ఉన్నారో... వాటి వివరాలు కూడా దరఖాస్తులో నమోదు చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ సమయంలో పోలీసులకు ఏదైనా అనుమానం వస్తే.. ముందు చిరునామాల్లో కూడా వెరిఫికేషన్ చేసి నివేదిక ఇస్తారు.
ఇదీ చూడండి: పిడుగుపాటు ఘటనల్లో ఒక్క రోజే 31 మంది మృతి