Outsourcing Employees Protest Over PRC: పీఆర్సీ సాధన సమితి నేతల తీరునూ నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. విజయనగరం జిల్లాలో నిరసన చేపట్టిన ఉద్యోగులు.. పెంచిన వేతనాలు 2019 నుంచి అమలు చేయాల్సి ఉండగా ఒప్పంద కార్మికులకు మాత్రం 2022 జనవరి నుంచి అమలు చేస్తామనడం దుర్మార్గమన్నారు. మాట తప్పను, మడమ తిప్పను అన్న సీఎం.. ఒప్పంద, పొరుగుసేవలు, కార్మికులకు తీవ్ర ద్రోహం చేశారని ధ్వజమెత్తారు.
విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమస్యల పరిష్కారానికి ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, పొరుగు సేవల ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. న్యాయపరమైన హక్కుల కోసం నిరసన తెలుపుతున్న ఉద్యోగుల్ని గృహ నిర్బంధం చేయడాన్ని తప్పు పడుతూ... విశాఖ జగదాంబ కూడలిలో సీఐటీయూ నిరసన చేపట్టింది. రివర్స్ పీఆర్సీ జీవోను వెనక్కి తీసుకునే వరకూ పోరాటం ఆగదని నేతలు స్పష్టం చేశారు. సీఐటీయూ కార్యాలయం దగ్గర జరిగిన నిరసనలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు రమాదేవి పాల్గొన్నారు.
విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆందోళన చేసిన ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు... పీఆర్సీ సాధన సమితి నేతలు మంత్రుల కమిటీ వద్ద కనీసం తమ సమస్యలను ప్రస్తావించలేదని మండిపడ్డారు. కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేసిన పారిశుద్ధ్య కార్మికులు.. కరోనా సమయంలో విధులు నిర్వహించిన వారికి నెలకి రూ.25 వేలు ప్రత్యేక అలవెన్సులు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ నందిగామ మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య, ఒప్పంద ఉద్యోగులు ధర్నా చేశారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
గుంటూరు నగరపాలక సంస్థ వద్ద కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. జీతాలు వెంటనే చెల్లించాలంటూ ప్రకాశం జిల్లా పొదిలి రక్షిత మంచినీటి సరఫరా విభాగం ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద తలపెట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. కడప మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు... పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేశారు. వేతనాలు పెంచకపోతే.... కలెక్టరేట్ల ముట్టడితో పాటు తాగునీరు, పారిశుద్ధ్యం పనులు నిలిపేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి
AP PRC: 'బోత్ ఆర్ నాట్ సేమ్...కప్పు తెమ్మంటే చిప్పతెచ్చారు'