లాక్డౌన్ సడలింపుల తర్వాత తిరిగి పున:ప్రారంభమైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరిస్థితి అగమ్యగోచరంగా మారంది. చాలా పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభం కాని పరిస్థితుల్లో.. ఆ ప్రభావం వాటికి సరఫరాకు ఉపయోగపడే ప్లాస్టిక్ పరికరాల పరిశ్రమలపై తీవ్రంగా పడింది. నెలకు 5-6లక్షల రూపాయలు ఖర్చులకే పోవాల్సి ఉండగా.... మార్కెట్ సరిగా లేక ఉత్పత్తి చేయాలా వద్దా అన్న మీమాంసతో పరిశ్రమలు నడుపుతున్నారు.
3 నెలల తర్వాత తెరుచుకున్న పరిశ్రమల్లోని మెషీన్లను తిరిగి రన్నింగ్ కండిషన్ లోకి తీసుకురావాలంటే పారిశ్రామికవేత్తలకు తలకుమించిన భారంగా మారింది. ఎక్కువ కాలం వాడకపోవటం వల్ల తలెత్తే మరమ్మత్తులు, వాటికి సంబంధించిన స్పేర్ పార్టులు ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సి ఉండటం వంటి సమస్యలు అనేకం ఎదురొచ్చాయి. వీటికి తోడు కార్మికుల సమస్య ఒకటైతే... మార్కెట్ డల్ అవటం తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని వాపోతున్నారు. గతంలో 3-4షిప్టుల్లో పనిచేసే పరిశ్రమలు ఇప్పుడు ఒక్క షిఫ్ట్ కే పరిమితమయ్యాయి.
ప్రస్తుత మార్కెట్ అంతా అత్యవసర వస్తువుల ప్రాధాన్యంగా నడుస్తున్నందున ఇతర పరిశ్రమల్లో ఉత్పత్తుల తయారీ పట్ల ఆచితూచి వెళ్లాల్సి వస్తోందని పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన ముడిసరుకు ఇబ్బందులు, రవాణా సమస్యలు వీటికి అదనంగా ఉండనే ఉన్నాయి. మార్చి చివరినాటికి ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా చేసుకునే నగదు కలెక్షన్లు కూడా ఈసారి కరోనా కారణంగా ఆగిపోయాయని వాపోతున్నారు. ఉన్నత చదువులు చదివి వ్యాపారం పై మక్కువతో ఉద్యోగం వదిలి వ్యాపారంలో స్థిరపడాలనుకున్న యువ పారిశ్రామికవేత్తలకు కరోనా పెద్ద సవాలే విసిరిందని వాపోతున్నారు. సమస్యలను మొండిగా అధిగమిస్తేనే నిలదొక్కుకోగలమని చెప్తూనే... పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో తెలియట్లేదని ఆవేదన చెందుతున్నారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలన్నీ ఒకదాని ఉత్పత్తులపై మరొకటి ఆధారపడి ఉన్నందున... అన్ని పరిశ్రమలూ నడిస్తేనే తమ పరిశ్రమా నడవగలదనే అంచనాలో వ్యాపారులు, వాటిపై ఆధారపడిన వర్గాల ప్రజలు ఉన్నారు.