Opposition Parties On PRC: ప్రభుత్వ ఉద్యోగుల పట్ల రాష్ట్ర సర్కారు నియంతలా వ్యవహరిస్తోందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ మండిపడ్డారు. ఉద్యోగులను వర్గాలుగా విడదీసి, ఉద్యమ స్ఫూర్తిని దెబ్బ తీయాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లుగా కనపడుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్మెంట్ విషయంలో ప్రభుత్వ కుట్రకోణం స్పష్టంగా కనపడుతోందన్నారు.
ఉద్యోగ వర్గాలలో చీలిక తీసుకొచ్చి వారి న్యాయమైన డిమాండ్లకు తిలోదకాలు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా కనపడుతోందన్నారు. ఉద్యోగుల ఉద్యమానికి భాజపా పూర్తి మద్దతుగా నిలుస్తుందన్నారు. వారి ఆందోళనకు అవసరమైతే నేతృత్వం వహించడానికి సిద్దమని మాధవ్ స్పష్టం చేశారు.
ఆ బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది: సీపీఎం
11వ పీఆర్‌సీపై ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. పీఆర్‌సీని రెండు సంవత్సరాలకుపైగా జాప్యం చేయటం వల్ల కిందిస్థాయి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. అధికారులు నిర్వహిస్తున్న చర్చలతో మరింత జాప్యం జరుగుతున్నందున.., ఉద్యోగ సంఘాలతో స్వయంగా సీఎం జగన్ చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలన్నారు.
ఎక్కువ ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ జరుగుతుందని ఉద్యోగులు ఎదురు చూస్తున్న తరుణంలో సీఎస్ కమిటీ 14.29 శాతం మాత్రమే సిఫార్సు చేయటం సబబు కాదన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెగ్యలర్‌గా పీఆర్‌సీలు ప్రకటించి ఉంటే.. ప్రస్తుతం 13వ పీఆర్‌సీ అమలు కావాల్సి ఉండేదన్నారు. జరిగిన జాప్యం వల్ల ఉద్యోగులు రెండు 2 పీఆర్‌సీల కాలాన్ని కోల్పోయారన్నారు. సకాలంలో పీఆర్‌సీ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :
Meeting on PRC: ఉద్యోగ సంఘాలతో చర్చలు.. పీఆర్సీపై వీడని ఉత్కంఠ