తెలుగు అకాడమీ కేసులో (telugu academy fd scam) సీసీఎస్ పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన సాంబశివరావును అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్‌కు తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. కెనరా బ్యాంకు మేనేజర్ సాధనకు సమీప బంధువైన సాంబశివరావు.. డిపాజిట్లు గోల్మాల్ చేసిన ముఠాకు సహకరించాడు. వెంకటరమణ ద్వారా సాయికుమార్‌ను పరిచయం చేసుకున్న సాంబశివరావు.. బ్యాంకుల్లోని ప్రభుత్వ శాఖల డిపాజిట్లను కొల్లగొట్టేందుకు ప్రణాళిక రచించారు. సాయికుమార్‌కు కెనరా బ్యాంకు మేనేజర్ సాధనను పరిచయం చేసిన సాంబశివరావు... ఆ తర్వాత కొల్లగొట్టిన డబ్బుల్లో 50 లక్షల రూపాయలను వాటాగా తీసుకున్నట్లు సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం కెనరా బ్యాంకు మేనేజర్ సాధనను సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 3 రోజులు ప్రశ్నించినా.. సరైన సమాధానాలు చెప్పలేదు. రేపటితో కస్టడీ ముగియనుండటంతో మరో నాలుగు రోజులు కస్టడీ పొడిగించాలని సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. వాటాగా తీసుకున్న డబ్బులో దాదాపు 80 లక్షల రూపాయలను కాల్చేసినట్లు మేనేజర్ సాధన.. సీసీఎస్ పోలీసులకు పొంతన లేని సమాధానం చెప్పింది. దీంతో సీసీఎస్ పోలీసులు అవసరమైతే నోట్లు కాల్చిన స్థలానికి క్లూస్ టీంను తీసుకొని ఆధారాలు సేకరించాలనే యోచనలో ఉన్నారు.
ఇదీ చదవండి:
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి నుంచి.. కనకదుర్గ అమ్మవారికి సారె