విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాల్లో కొవిడ్ నిబంధనల అమలు తీరుపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదేశాలు పటిష్టంగా అమలు చేయట్లేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. దేవాలయం ఆవరణ, క్యూలైన్లలో తప్పనిసరిగా.. 6 అడుగుల భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. అది ఎక్కడా అమలు కావడం లేదని ఆందోళన చెందుతున్నారు.
థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ చేయట్లేదని భక్తులు చెబుతున్నారు. టికెట్ తీసుకున్న వారంతా ఒకేసారి గుడి వద్దకు వచ్చేస్తున్నారు. క్యూలైన్లు, గుడిలోపల భక్తుల మధ్య కనీసం అడుగు దూరం కూడా ఉండని పరిస్ధితి ఉందంటున్నారు. పర్యవేక్షించాల్సిన పోలీసులు, అధికారులు, సిబ్బంది సరిగా దృష్టి పెట్టడం లేదని భక్తులు అంటున్నారు.
కరోనా ప్రభావంతో పరిమిత సంఖ్యలోనే భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నారు. రోజుకు పదివేల మందికి మాత్రమే దర్శనాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చేసేందుకు నిబంధనలు రూపొందించినా.. సక్రమంగా అమలు కావట్లేదని భక్తులు అంటున్నారు.
వీఐపీల వల్ల సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వారి దర్శనానికి ప్రత్యేక సమయం వేళల్ని కేటాయించినట్లు అధికారులు తొలుత ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వీఐపీల దర్శనానికి సమయం కేటాయించారు. ఆ సమయం దాటినా వీఐపీలను అనుమతించడంతో.. తమ దర్శనాలు నిలపటంతో ఇబ్బందులు పడుతున్నట్లు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 5 రోజులపాటు నవరాత్రుల వేడుకలు జరుగుతాయి. రేపు మూలా నక్షత్రం కావడం వల్ల భక్తులు పెద్దఎత్తున వచ్చే అవకాశాలున్నాయి. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు...అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనం