AP Night Curfew: కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. కర్ఫ్యూ మార్గదర్శకాలను వైద్య,ఆరోగ్యశాఖ విడుదల చేయనుంది.
''దేవాలయాలు, ప్రార్థనామందిరాల్లో భౌతికదూరం తప్పనిసరి. ప్రజలు మాస్కు ధరించేలా చర్యలు చేపట్టాలి. మాస్కులు ధరించకపోతే జరిమానాలు విధించాలి. కొవిడ్ నివారణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయాలి. 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు నడపాలి. వ్యాపార సముదాయాల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరి. బస్సుల్లో ప్రయాణికులు మాస్కు ధరించేలా చూడాలి. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి మించకూడదు. ఇండోర్ కార్యక్రమాల్లో 100 మందికి మించకూడదు. థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలి.'' - సీఎం జగన్
కరోనా ఆంక్షలు.. మళ్లీ అమలులోకి..
థియేటర్లలో ఒక సీటు విడిచి మరో సీటులో మాత్రమే ప్రేక్షకులు కూర్చునేలా, బహిరంగ ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాల్లో 200 మందికి మించి పాల్గొనకుండా షరతులు విధించబోతున్నారు. ‘ఇండోర్ హాల్స్’లో ఈ సంఖ్యను 100కు పరిమితం చేయనున్నారు. గత డిసెంబరు రెండో వారంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో గరిష్ఠంగా 500 మంది హాజరయ్యేందుకు అనుమతి ఉంది. కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మళ్లీ ఈ నిబంధనలను సవరించబోతున్నారు.
మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ఇతర కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మాస్కులు ధరించని వారికి రూ.100 జరిమానా విధిస్తారు. దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థల్లో మాస్కులు ధరించనివారు కనిపిస్తే వాటి యజమానులకు రూ.10వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించే నిబంధనను కఠినతరం చేయనున్నారు. అవసరమైతే.. ఒకటి, రెండురోజులపాటు దుకాణాలు మూసివేసేలా ఆదేశించనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఒక సీటు విడిచి మరో సీటు భర్తీ చేయటంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దేవాలయాల్లోనూ మాస్కులు ధరించటం, భౌతిక దూరం నిబంధన అమలయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.
ఇదీ చదవండి